calender_icon.png 22 April, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు, రేపు ఒరియంటేషన్ ప్రోగ్రాం

11-12-2024 12:51:03 AM

*ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరుకావాలి 

*స్పీకర్ ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సూచన 

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): అసెంబ్లీ విధానాలు, చట్టాలు, బిల్లు లకు సంబంధించిన అంశాలపై నిర్వహించే ఒరియంటేషన్ ప్రోగ్రాంకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరుకావాలని శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో బుధ, గురువారాల్లో నిర్వహించే  ఒరియంటేషన్ ప్రోగ్రాం ఏర్పాట్లను స్పీకర్, మండలి చైర్మన్ మంగళవారం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సభ గొప్పతనం, ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇవ్వాలనే అంశాలపై అవగాహన  కల్పిస్తారని, సభ్యులందరూ హాజరుకావాలన్నారు. వారి వెంట అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహాచార్యులు, ఎంసీహెచ్‌ఆర్‌డీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శశాంక్‌గోయల్, ఇతర అధికారులు ఉన్నారు. 

మొదటిరోజు కార్యక్రమాలు.. 

* ఉదయం 10:30 నుంచి 11:15 గంటల వరకు ప్రారంభోత్సవ కార్యక్రమం, 11:15 నుంచి 12:00 గంటల వరకు ఫొటో సెషన్, టీ బ్రేక్. 

* మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు సభ్యుడి పనితీరుకు సంబంధించి అవగాహన కార్యక్రమం, 1:30 వరకు ప్రశ్నావలి కార్యక్రమం ఉంటుంది. 1:30 నుంచి 2:30 గంటల వరకు  లంచ్‌బ్రేక్ ఇవ్వనున్నారు. 2:30 నుంచి 3:30 గంటల వరకు సభలో ప్రివిలేజ్ మోషన్, ప్రొటోకాల్‌తో పాటు సభా నిబంధనలపైన శిక్షణ, 4 గంటల వరకు శాసన సభలో సభ్యులు అడిగే ప్రశ్నలు, ప్రభుత్వం నుంచి వచ్చే జవాబు, 4 నుంచి 5 గంటల వరకు ప్రశ్నావలి, జీరో అవర్, రెజులేషన్, అర్జన్‌మెంట్ మోషన్, స్పెషల్ మెంటేన్స్ లేదా అర్జంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఇతర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.    

రెండో రోజు కార్యక్రమాలు.. 

ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు బిల్లుల ఇంట్రడక్షన్, బిల్లుల కన్సిడరేషన్ లేదా పాసింగ్ అంశాలపై అవగాహన కల్పిస్తారు. 11:30 నుంచి 12 గంటల వరకు ప్రశ్నావలి సేషన్.. 12:30 గంటల వరకు టీ బ్రేక్ ఉంటుంది. 12:30 నుంచి 1:30 గంటల వరకు బడ్జెట్ ప్రవేశపెట్టే అంశం, 1:30 నుంచి 2 గంటల వరకు ప్రశ్నలు జవాబులు అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించనున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత 3 నుంచి 4 గంటల వరకు అసెంబ్లీలో కమిటీల బలోపేతం,  4 నుంచి 4:30 గంటల వరకు ప్రశ్నలు  5 నుంచి 6 గంటల వరకు వాలిడైక్టరీ సేషన్‌పై సభ్యులకు అవగాహన కల్పించనున్నారు.

అవగాహన తరగతులను బహిష్కరిస్తున్నాం 

*స్పీకర్ తీరుకు నిరసనగా నిర్ణయం

* బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్‌లో నేటి నుంచి జరిగే ఎమ్మెల్యేల అవగాహన తరగతులను బీఆర్‌ఎస్ బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొలి రోజు సభలోకి రాకుండా తమ హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను ఎత్తి చూపితే అక్రమంగా అరెస్టు చేశారన్నారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు.

గత అసెంబ్లీ సమావేశాల్లో తమ గొంతు నొక్కేలా వ్యవహ రించారని తెలిపారు. తమకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరును నిరసిస్తూ నేటి నుంచి ఎమ్మెల్యేలకు జరిగే అవగాహన తరగతులకు దూరంగా ఉంటున్నామని పేర్కొ న్నారు. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా వ్యవహరించాలని స్పీకర్‌ను కోరారు.