మూడురోజుల పాటు పర్యటన
హనుమకొండ, ఆగస్టు 26 (విజయక్రాంతి): తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం వరంగల్‌కు విచ్చేయనున్నారు. తొలిరోజు ములుగు జిల్లాలో పర్యటించి వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన అవార్డు గ్రహీతలతో సమావేశమవుతారు. అనంతరం యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయ కళాఖండం రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. లక్నవరం పర్యాటక ప్రాంతాన్ని దర్శిస్తారు. బుధవారం హనుమకొండకు చెందిన కళాకారులు, ప్రముఖులతో సమావేశం కానున్నారు. తర్వాత వరంగల్ , భద్రకాళి ఆలయం, వేయి స్తంభాల గుడిని సందర్శిస్తారు. చివరిరోజు గురువారం జనగామ జిల్లాలో కవులు, కళాకారులతో సమావేశమవుతారు. అనంతరం కొలనుపాకను సందర్శిస్తారు. గవర్నర్ పర్యటన సందర్భంగా వరంగల్, ములుగు, జనగామ జిల్లాల పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.