ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు పూర్తి
హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ట్యాంక్ బండ్ వేదికగా గురువారం ప్రభుత్వం భాషా సాంస్కృతిక, పర్యాటకశాఖల ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుక నిర్వహించనున్నది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయి.
సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, అరుణోదయ విమలక్క హాజరుకానున్నారు.
10 వేల మందితో వేడుక..
బతుకమ్మ వేడుకలో సుమారు 10 వేల మంది మహిళలు పాల్గొని ఆడి పాడనున్నారు. అనంతరం రోటరీ పార్కు పాండ్స్‌లో బతుకమ్మలను నిమజ్జనం చేయనున్నారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 11 వరకు అప్పర్ ట్యాంక్‌బండ్, అమరవీరుల స్మారక స్థూపం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుంది.