calender_icon.png 22 September, 2024 | 10:55 PM

నేడు లాల్‌దర్వాజ బోనాలు

28-07-2024 03:58:28 AM

  1. అమ్మవారికి బోనం సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి 
  2. పట్టువస్త్రాలు సమర్పించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు

చార్మినార్, జూలై 27: నేడు పాత నగరంలో లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళీ అమ్మవారి బోనాలు నిర్వహించనున్నారు. వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు. అదేవిధంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ బోనం సమర్పించనున్నారు. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పి స్తారు. వేడుకల్లో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. బోనాలు, సామూహిక ఘటాల ఊరేగింపు సందర్భంగా పాతబస్తీలో ఎలాం టి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం 2200 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు.

1908 నుంచి వేడుకలు..

హైదరాబాద్‌లో 1908 సంవత్సరంలో భారీ వర్షాలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. అప్పట్లో వేలాది మంది ప్రజలు వరదల్లో కొట్టుకుపోయారు. వరదలకు తోడు పలు రకాల వ్యాధులు ప్రజలను పట్టిపీడించాయి. నిజాం నవాబు వద్ద ప్రధాన మంత్రి గా విధులు నిర్వహిస్తున్న మహారాజా కిషన్‌ప్రసాద్ నవాబు వద్దకు వెళ్లి లాల్‌దర్వాజలో శ్రీ మహంకాళీ అమ్మవారికి పూజలు నిర్వహించి వరదల నుంచి కాపాడమని కోరుకుంటే మంచి జరుగుతుందని చెప్పడంతో అందుకు నవాబు అంగీకరించాడు. వెంటనే కిషన్ ప్రసాద్ బృందం కొత్త చాటలో అమ్మవారికి బోనం సమర్పించి పట్టువస్త్రాలతో పాటు గాజులు, పసుపు, కుంకుమ, ముత్యాలను సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పూజ చేసిన సామగ్రిని చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు భారీగా చేరుకున్న వరద నీటిలో కలిపారు. దీంతో కొన్నిగంటల్లోనే వర్షాలు తగ్గుముఖం పట్టి వరదలు వెనక్కి వెళ్లిపోవడంతో ప్రజలు ఊపీరి పీల్చుకున్నారని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.      

పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (విజయక్రాంతి): నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం బోనాలు జరగనున్నాయి. పలువురు మంత్రులు అమ్మవా ర్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాలిబండలోని అక్కన్న మాదన్న దేవాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మకు మంత్రి దామోదర రాజనర్సింహ, మిరాలం మండిలోని మహంకాళి అమ్మవారికి మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్వాన్ సబ్జిమండిలోని నల్లపోచమ్మ ఆలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చిలకలగూడ  ట్యాంక్‌బండ్ కట్టమైసమ్మకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సరూర్‌నగర్ ఎన్‌టీఆర్ నగర్‌లోని మైసమ్మకు మంత్రి సీతక్క, నాచారం మహంకాళి సహిత మహంకాళేశ్వర్ స్వామి దేవస్థానంలో జరిగే ఉత్సవాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 

నేడు మద్యం షాపులు బంద్

బోనాల పండుగ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం షాపులను బంద్ చేస్తున్నట్లు సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 వరకు వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలని ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ స్టార్ హోటళ్లలో ని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.