తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగలో భాగంగా ఏడో రోజు వేపకాయల బతుకమ్మను నిర్వహిస్తారు. నేటి వేపకాయల బతుకమ్మలో భాగంగా వేప చెట్టుని ఆదిపరాశక్తికి ప్రతిరూపంగా భావించి వేపకాయల బతుకమ్మను పూజిస్తున్నారు. వేపకాయల బతుకమ్మ పండుగ రోజు చామంతి, గునుగు, తంగేడు, గులాబీ పూలతో ఏడు దొంతరలుగా బతుకమ్మను పేరుస్తారు.
సకినాలు తయారు చేయడానికి ఉపయోగించే పిండితో చిన్న వేప పండ్లు ఆకారంలో చిన్న ముద్దలు చేసి బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. అంతేకాదు పప్పు బెల్లాన్ని కూడా నైవేద్యంగా ఏడో రోజు సమర్పిస్తారు. వేపకాయల బతుకమ్మలో భాగంగా ఉదయం బతుకమ్మలను పూజించినవారంతా, సాయంత్రం పూట బతుకమ్మని ఇంటి ముంగిట్లో పెట్టి అంతా కలిసి పాటలు పాడుతూ ఆడతారు.
ఇలా ఏడో రోజు ఏడు అంతరాల బతుకమ్మ గంగమ్మ చెంతకు చేరుతుంది. ఇంకా మిగిలిన రెండు రోజులు బతుకమ్మ ఆటలకు తెలంగాణ ఆడపడుచులు రెడీ అవుతారు. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతారు.