- హైదరాబాద్‌లో మొదటిసారి నిర్వహణ
- ప్రారంభించనున్న సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, సెప్టెంబర్ 04 (విజయ క్రాంతి): సెప్టెంబర్ 5, 6 తేదీల్లో జరిగే గ్లోబ ల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సదస్సులకు కేంద్ర బిందువుగా నిలిచిన హైదరాబాద్ నగరం.. మరో మైలురాయి అందుకోనుంది. అంతర్జాతీయ సదస్సయిన గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్‌లో నిర్వహిస్తుండడంతో నగరం కీర్తి మరోసారి ప్రపంచవ్యాప్తం కానుండడం విశేషం. ‘ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేధస్సుతో పని’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ సదస్సును ప్రారంభించనున్నారు.
ప్రపంచం నలుమూలల నుంచి ఏఐ రంగంలో పేరొందిన ప్రముఖులు, పలు సంస్థలకు చెందిన దాదాపు 2 వేలకు పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఏఐ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ ఖాన్, ఐబీఎం నుంచి డానియోలా కాంబ్, ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్ పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు హాజరవుతారు. భవిష్యత్ అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చలు జరుపుతారు. సామాజిక బాధ్యతగా సమాజంపై ఏఐ ప్రభావం, నియంత్రణ, సవాళ్లపై చర్చిస్తారు. కొత్త సాంకేతికత పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ధి దశలో ఉన్న వినూత్న ప్రాజెక్టులను ఈ సదస్సులో ప్రదర్శిస్తారు.
రెండు రోజుల ఈవెంట్‌లో ప్రధాన వేదికతోపాటు నాలుగు అదనపు వేదికలను ఏర్పాటు చేశారు. అన్ని వేదికలపై ఏఐకి సంబంధించిన వేర్వేరు అంశాలపై చర్చలు, ఇష్టాగోష్ఠి సెషన్స్‌తోపాటు హైప్రొఫైల్ ప్యానెల్ డిస్కషన్స్, ఇంటరాక్టివ్ సెషన్లను ఏర్పాటు చేశారు. ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సదస్సును నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్ఠాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఐటీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను, అందుకు రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని ఈ ఏఐ గ్లోబల్ సదస్సు ప్రపంచానికి చాటి చెబుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ రంగాల్లో ఏఐ సేవలను, అభివృద్ధి అవకాశాలతో భవిష్యత్ కార్యాచరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను రూపొందించింది. దాదాపు 25 కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. సదస్సులో సీఎం రోడ్ మ్యాప్‌ను విడుదల చేస్తారు.