calender_icon.png 26 December, 2024 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సఫారీలతో సై

08-11-2024 01:32:04 AM

  1. నేడు భారత్, సౌతాఫ్రికా తొలి టీ20

  2. శాంసన్, అభిషేక్‌పై భారీ ఆశలు 
  3. రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ 

* స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను పోగొట్టుకున్న టీమిండియా సఫారీ గడ్డపై టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. సూర్యకుమార్ సారథ్యంలోని యువ జట్టు సౌతాఫ్రికాను ఓడించి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి సౌతాఫ్రికా బదులు తీర్చుకోవాలని చూస్తోంది.

డర్బన్: ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించిన భారత్ రెండోసారి వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. తాజాగా సఫారీలను వారి సొంతగడ్డపై మరోసారి చిత్తు చేసేందుకు భారత్ సిద్ధమైంది.

నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు డర్బన్ వేదికగా టీమిండియా, సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 జరగనుంది. టీ20 ప్రపంచకప్ సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ వీడ్కోలు పలకగా సూర్యకుమార్ నేతృత్వంలోని టీమిండియా సఫారీ గడ్డపై సిరీస్ ఆడనుంది.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా పంత్, బుమ్రా, జైస్వాల్, గిల్, సుందర్‌లకు ఈ టోర్నీ నుంచి మినహాయింపు ఇచ్చారు. సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా మినహా మిగతా సీనియర్లు ఎవరు లేకుండానే భారత్ బరిలోకి దిగుతోంది. మరోవైపు టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. 

పేపర్‌పై బలంగానే..

భారత జట్టు విషయానికి వస్తే సూర్య, అభిషేక్, శాంసన్, రింకూ, తిలక్, జితేశ్, పాండ్యా, అక్షర్, రమన్‌దీప్‌లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో యశ్ దయాల్, అర్ష్‌దీప్, విజయ్ కుమార్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌లతో బలంగానే ఉంది. జైస్వాల్, గిల్ గైర్హాజరీలో అభిషేక్, శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది.

వన్‌డౌన్‌లో కెప్టెన్ సూర్య వచ్చే అవకాశముంది. తిలక్ వర్మ, పాండ్యా మిడిలార్డర్‌లో రానున్నారు. ఫినిషర్‌గా రింకూ సింగ్ ఉండనున్నాడు. అర్ష్‌దీప్ పేస్ బాధ్యతలు మోయనుండగా.. అవేశ్ ఖాన్, యశ్ దయాల్ అతనికి సహకరిస్తున్నారు. స్పిన్నర్లుగా అక్షర్, వరుణ్ చక్రవర్తి లేదా రవి బిష్ణోయి ఉండనున్నారు. మరోవైపు మార్కరమ్, హెండ్రిక్స్, క్లాసెన్, మిల్లర్, మార్కో జాన్సెన్, స్టబ్స్‌లతో పటిష్టంగానే కనిపిస్తోంది. బౌలింగ్‌లో కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, జాన్సన్ కీలకం కానున్నారు. 

భారత జట్టు అంచనా:

సూర్య (కెప్టెన్), పాండ్యా, అభిషేక్, శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ , వరుణ్/ రవి బిష్ణోయి, అర్ష్‌దీప్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్