calender_icon.png 30 September, 2024 | 2:58 AM

సీఎంఆర్ అప్పగింతకు నేడే డెడ్‌లైన్

30-09-2024 12:39:06 AM

  1. కామారెడ్డి జిల్లాలో రూ.100 కోట్ల విలువైన బియ్యం బకాయి
  2. ప్రభుత్వం మూడుసార్లు గడువు ఇచ్చినా స్పందించని మిల్లర్లు
  3. బియ్యం అప్పగించని వారిపై చర్యలకు రెడీ అవుతున్న అధికారులు

కామారెడ్డి, సెప్టెంబర్29(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో సుమారు రూ.100 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యాన్ని రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. బియ్యం అప్పగింత కోసం ఇప్పటివరకు ప్రభుత్వం మూడుసార్లు అవకాశమిచ్చింది.

చివరగా 2 నెలల సమయమిస్తే బకాయిపడ్డ సీఎంఆర్ మొత్తాన్ని అప్పగిస్తామని కొత్తగా వచ్చిన కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌కు మిల్లర్లు తెలిపారు. ఈ గడువు కూడా ఈ నెల 25తో ముగిసింది. అయినా మిల్లర్ల నుంచి ఆశించిన మేర స్పందన రాకపోవడంతో జిల్లా పాలనాధికారి చివరగా ఈ నెల 30 వరకు గడువు పొడగించారు.

ఇప్పటి వరకు కొంతమంది రైస్‌మిల్లర్లు మాత్రమే స్పందించి సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించగా.. మరికొందరు బియ్యానికి బదులుగా డబ్బులు చెల్లించారు. జిల్లాలోని అనేక మంది మిల్లర్లు మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇలా సుమారు రూ.100 కోట్ల విలువైన సీఎంఆర్ పక్కదారి పట్టింది. గత రెండు సీజన్లలో ప్రభుత్వం రైస్‌మిలర్లకు సీజన్లలో ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, ధాన్యాన్ని మర ఆడించమని మిల్లర్లకు అప్పగించింది. 2021-22లో 120 మంది రైస్‌మిల్లర్లకు సుమారు రూ.500 కోట్ల విలువైన ధాన్యం అప్పగించగా, రూ.430 కోట్ల విలువైన బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించారు.

ఇంకా 36 మంది మిల్లర్లు రూ.70 కోట్ల విలువైన బియ్యం తిరిగి అప్పగించలేదు. బాన్సువాడ నియోజకవర్గంలోని 35 మంది రైస్‌మిల్లర్లు సుమారు రూ.70 కోట్ల విలువైన సీఎంఆర్‌ను ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో ఆ మిల్లులను ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. 2022 సీజన్‌లో ఈ 35 మంది మిల్లర్లకు ధాన్యం కేటాయించలేదు. బకాయిపడ్డ సీఎంఆర్ రైస్‌ను చెల్లించాలని ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు గడువు విధించింది.

ఉన్నతాధికారుల ఆదేశాలతో కలెక్టర్ సంగ్వాన్ ఈ నెల 30 వరకు చివరి అవకాశం కల్పించారు. సీఎంఆర్ చెల్లించని పక్షంలో ఆర్‌ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు సంబంధిత మిల్లర్ల ఆస్తులను జప్తు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అయినా మిల్లర్లు స్పందించడం లేదు. 2022-23 సీజన్‌లో 162 మిల్లులకు ప్రభుత్వం ధాన్యాన్ని అప్పగించింది.

ఇప్పటి వరకు 70 శాతం రైస్‌మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని తిరిగి అప్పగించగా మరికొంతమంది రైస్‌మిల్లర్లు డబ్బులు చెల్లించారు. మిగతావారు బియ్యం కానీ, డబ్బులు కానీ చెల్లించలేదు. వీరిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేందుకు వెనకాడబోమని అధికారులు పేర్కొంటున్నారు.

కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు పలు సమావేశాలు నిర్వహించి హెచ్చరికలు జారీ చేసినా కొంతమంది రైస్‌మిల్లర్లు స్పందించకపోవడంతో అధికారులు సీరియస్‌గా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి గడువు విధిస్తారా లేదా చర్యలు తీసుకుంటారా అనే విషయమై సోమవారం స్పష్టత వస్తుంది.

గడవులోగా చెల్లించని రైస్‌మిల్లర్లపై చర్యలు

కామారెడ్డి జిల్లాలో 2021-22, 2022-23 సీజన్లలో ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని తీసుకొని సీఎంఆర్ బియ్యాన్ని అప్పగించని రైస్‌మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. ఇప్పటి వరకు 2022-23 సీజన్‌లో ధాన్యాన్ని స్వీకరించి రైస్‌మిల్లర్లలో 70 శాతం వరకు మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని అప్పగించారు. మరికొంతమంది డబ్బులను చెల్లించారు. బియ్యం లేదా డబ్బులు చెల్లించని మిల్లర్ల వివరాలు ఈ నెల 30 వరకు గుర్తించి కలెక్టర్‌కు నివేదిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలుంటాయి.

- రాజేశ్వర్, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్, కామారెడ్డి