15-11-2024 12:00:00 AM
మానవీయ గురువు
సిక్కుల తొలి పవిత్ర గురువు గురునానక్ 555వ జయంతిని నేడు ప్రపంచవ్యాప్తంగా ఆ మతస్థులు, అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గురునానక్ జయంతిని ‘గురు పూరబ్’ లేదా ‘ప్రకాశ్ ఉత్సవ్’ పేరుతోనూ పిలుస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా ‘కార్తీక పూర్ణిమ’ ఘడియల్లో గురునానక్ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పదిమంది సిక్కు గురు వుల జాబితాలో తొలివారైన గురునానక్ ఒక ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, రచయిత, ప్రవచనకర్త, తత్త్వవేత్త.
ఆయన సిక్కుమత స్థాపకులుగా సమానత్వం, దురాచారాలను ఎండ గట్టడం, దేవుడు ఒక్కడే అని ప్రబోధించడం, కులమతరహిత మానవ సమాజం, కరుణ, దయ, శాంతియుత సహజీవనం, ఐక్యత, మానవీయత వంటి సద్గుణాలను ప్రభోదించారు. ఏడు దశాబ్దాల జీవితాన్ని మానవీయ విలువల బోధనలకే అంకితం చేశారు.
గురునానక్ అమూల్య బోధనల్లో ‘భగవంతుడు ఒక్కడే’ (ఏక్ ఓం కార్) ముఖ్యమైంది. నేటి పాకిస్తాన్‌లోని లాహోర్ సమీప రాయ్‌భోయ్ ది తల్వండీ అనే గ్రామంలో తేదీల ప్రకారం 15 ఏప్రిల్ 1469న గురునానక్ జన్మించారు. 1487లో మాతా సులక్నీని వివాహమాడి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక అంశాలపట్ల ఆసక్తి చూపుతూ సామాజిక అసమానతలు, కులమత విభేదాలను వ్యతిరేకించారు.
16వ ఏట పలు మత గ్రంథాలను ఔపోసన పట్టారు. సంస్కృతం, పార్సీ, హిందీ భాషల్లో ప్రావీణ్యం పొందారు. 30వ ఏటనే ఆధ్యాత్మిక మేల్కొలుపును పొంది సమానత్వం, కరుణ, భక్తి భావనలను నాటి ప్రజానీకానికి బోధించారు. 70వ ఏట 22 సెప్టెంబర్ 1539న కన్ను మూశారు. మానవీయ విలువకు కట్టుబడి ఆయన చూపిన దారిలో మన జీవితాలను సుసంపన్నం చేసుకోవాలి.
టొ డా. బుర్ర మధుసూదన్ రెడ్డి