నేడు మాసశివరాత్రి
ఓం ‘నమఃశివాయ’ అనే పంచాక్షరి మంత్ర మహిమను తెలిపే దివ్య సన్నివేశాలు ‘శివ పురాణం’లో ఉన్నాయి. బ్రహ్మ, విష్ణువులకు సాక్షాత్తు పరమశివుడే తన నామశక్తిలోని అర్థ పరమా ర్థాలను తెలియజేశాడు. సృష్టి (పుట్టుక), స్థితి (పాలన), సంహారం (లయ), తిరోభా వం (మరుగున పడడం), అనుగ్రహం (ముక్తి) అనే అయిదు జగత్తుకు సంబంధించిన ఈశ్వర కార్యాలు. ప్రపంచాన్ని రచిం చడం ‘సృష్టి’ అయితే, దానిని సుస్థిర రూపంలో ఉంచడం ‘స్థితి’. దాని వినాశమే ‘సంహారం’ (లయ). ప్రాణాలు పోవడం ‘తిరోభావం’, వీటన్నిటి నుంచీ ముక్తిని పొంద డమే ‘అనుగ్రహం’ అంటారు.
ఈ అయిదు కృత్యాలలో మొదటి నాలుగు ప్రపంచానికి సంబంధించినవి. అయిదవదైన ‘అనుగ్రహం’ మోక్షానికి హేతువు. ఇది శివునిలోనే స్థిరమై ఉంటుంది. శివ భక్తులు ఈ అయిదు కృత్యాలను పంచమహా భూతాలలో చూస్తారు. సృష్టిని భూతలంలో, స్థితిని జలంలో, లయను అగ్నిలో, తిరోభావాన్ని గాలిలో, అనుగ్రహాన్ని ఆకాశంలో దర్శిస్తారు. పృథ్వినుంచి అందరి సృష్టీ జరుగుతుంది. జలం ప్రాణుల వృద్ధినీ కాంక్షిస్తూ జీవరక్షణ చేస్తుంటుంది. అగ్ని అందరినీ సమానంగా కాల్చి వేస్తుంది. వాయువు ఒక స్థానం నుంచి మరో స్థానానికి కొనిపోతుంది. ఆకాశం భేదభావం లేకుండా ప్రతీ ఒక్కరినీ అనుగ్రహిస్తుంది. ఈ అయిదు కృత్యాల భారాన్ని మోస్తున్న కారణంగానే శివునికి ‘అయిదు ముఖాలు’ ఉన్నట్లు శివ పురాణం చెబుతున్నది.
శివుని పంచముఖాలలోని పరమార్థం
అవిభాజ్యమైన రుద్రుడు, మహేశ్వరుడు శివుని నుంచే ఉద్భవించారు. వీరు సంహార, తిరోభావాలను ప్రాప్తింపజేస్తుంటారు. అయితే, ‘అనుగ్రహం’ అనే కృత్యాన్ని మాత్రం ఆయన తప్ప, మరెవరూ ప్రసాదించలేరు. కారణం, అది ఆయన వెంటే ఉంటుంది. రుద్రునికి, మహేశ్వరునికి తనతో సమానమైన శక్తియుక్తులను పరమేశ్వరుడు ఇచ్చాడు. రూపంలో, వేషంలో, కృత్యంలో, వాహనాలను అధిష్ఠించటంలో, ఆసనంపై కూర్చోవడంలో, ఆయుధాలను ధరించడంలో వారు శివునితో సమానులుగా ఉంటారు.
ఓం ‘నమఃశివాయ’ అనే మంత్రాక్షరాలు సాక్షాత్తు శివశక్తి సమేతమై ఉంటాయి. ఈ మంత్రం స్మరిస్తే శివుణ్ని స్మరించినట్లే. తన అయిదు ముఖాలతో ఓంకారానికీ సంబంధం ఉంది. ఉత్తరాభి ముఖంగా వున్న మోముతో అకారం, పశ్చిమాభి ముఖంగా వున్న మోముతో ఉకారం, దక్షిణాభి ముఖంగా వున్న మోముతో మకారం, తూర్పాభి ముఖంగా వున్న మోముతో బిందువు, మధ్యన ఉన్న ముఖంతో నాదం ప్రకటితమవుతాయి. ఇలా పంచాక్షరి మంత్రం శివుని అయిదు ముఖావయవాల యుక్తమై ఉంది. ఈ అన్ని ముఖాల ఏకీభూతమే ప్రణవం. అదే ‘ఓం’ అనే ఏకాక్షరం.
జగత్తులోని స్త్రీ, పురుషులు అందరిలోనూ ప్రణవ మంత్రం పరివ్యాప్తమై ఉంటుంది. ఈ మంత్రంలో శివుడు, పార్వతీదేవి ఇద్దరూ నిబిడీకృతమై ఉన్నారు. ఆకారాది క్రమంతో, మకారాది క్రమంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఇలా ‘ఓం నమః శివాయ’ మంత్రాక్షరాలు ఆదిదంపతుల నిలువెత్తు స్వరూపాలకు ప్రతీకవలె నిలుస్తున్నాయి. ఈ మంత్ర జపంతో మనసులోని కోర్కెలన్నీ అద్భుత రీతిలో సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అటు భోగం, ఇటు మోక్షం రెంటికీ ఇదే ఏకైక మార్గం.
- ఎం.వి.
నరసింహారెడ్డి