calender_icon.png 11 October, 2024 | 6:55 AM

నేడు మహర్నవమి, రేపు విజయదశమి దసరానందం

11-10-2024 12:00:00 AM

శమే శమయతే పాపం 

శమీ శత్రు వినాశినీ

అర్జునస్య ధనుర్ధారీ 

రామస్య ప్రియదర్శినీ॥

శమీం కమల పత్రాక్షీం 

శమీం కంటక ధారిణీమ్‌

ఆరోహతు శమీం లక్ష్మీం 

నృణామాయుష్య వర్ధనీమ్‌॥

నమో విశ్వాస వృక్షాయ 

పార్థ శస్త్రాస్త్ర ధారిణే

త్వత్తః పత్రం ప్రతీక్ష్యామి 

సదా మే విజయీభవ॥


ఏదయా మీ దయా మామీద లేదు

ఇలా నిలబెట్టడం న్యాయమా మీకు

ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు. 

దసరాకు వస్తిమని విసవిసలు పడకా

చేతిలో లేదనక అప్పివ్వరనకా

రేపురా మాపురా మళ్లి రమ్మనకా

పావలా అర్ధయితే పట్టేది లేదు

ముప్పావలా అయితే ముట్టేది లేదు

హెచ్చురూపాయయితే పుచ్చుకుంటాము

అయ్యవారికి చాలు ఐదు వరహాలు

పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు

జయీభవా.. విజయీభవా..

ఈ తరహా శ్లోకాలు, పాటలతో ఊళ్లు, పట్టణాలు, నగరాలు మారుమోగి పోయేలా చేసే మహా వేడుక దసరా. యావత్ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత అట్టహాసంగా భారతీయులంతా కలిసి తనివితీరా ఆనందాన్ని అనుభవిస్తూ జరుపుకొనే గొప్ప సంబరాల జాతర.

ముఖ్యంగా తెలంగాణలో అటు పెద్ద బతుకమ్మ, ఇటు దసరా పండుగ వస్తున్నాయంటే చాలు, పదిహేను రోజుల ముందునుంచే అట్టహాసాలు, ఆర్భాటాలు, హడావిడులు. ఈ రెండు పండుగల వేళ ఆర్థిక స్థోమతలకు అతీతంగా ఉన్నంత లో కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ కొత్త బట్టలు కుట్టించుకోవడం ఆనవాయితీ. ఒకప్పుడే కాదు, ఇప్పటికీ దర్జీ వాళ్లవద్ద రద్దీ అసాధారణం.

ఏ ఊ ళ్లో వున్నా ఈ పండుగలకు కుటుంబసభ్యులం తా ఒక్కచోటకు చేరడం తప్పనిసరి. దసరా నాటి సాయంత్రం మగవారంతా జంబి (పాలపిట్ట దర్శనం)కి వెళితే, ఆడవారు పట్టుబట్టల తో ముస్తాబై గుండెనిండుగా బతుకమ్మలు ఆడుతూ, పాడుతూ, ఆనందోత్సాహాలతో గడుపుతారు.

విజయగాథలే స్ఫూర్తిగా..

రోజు రోజుకు మృగ్యమవుతున్న మానవ సంబంధాలను పునరుద్ధరిస్తూ మనిషిలోని సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ కులాలకు అతీతంగా పెద్దలను గౌరవించడమే ప్రధానంగా ‘దసరా’ పండుగ తెలంగాణల ప్రతిబింబిస్తుంది. ఒకవైపు సనాతన వైదిక సంస్కృతిని అనుసరించి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, మరోవైపు గ్రామీణ జానపద సంప్రదాయానుసారం ‘బతుకమ్మ’ ద్వారా మహిళా చైతన్య శక్తిని ఆరాధించటం.

ప్రకృతిని వివిధ రూపాల్లో కొలవటమే దసరా పండుగ ఇచ్చే సందేశం. భారతీయ ఇతిహాసాల కథనాలు జ్ఞప్తికి తెచ్చుకొని స్ఫూర్తి పొంది ముందడుగు వేయటం మరో కోణం. అర్జునుడు అస్త్రశస్త్రాలను దాచిపెట్టిన జమ్మిచెట్టు పూజ, సీతాపహరణం గావించిన దశకంఠుని చిత్రపటాన్ని దగ్ధం చేసి శ్రీరామచంద్రుని, పాండవ మధ్యముడు, సవ్యసాచి అయిన అర్జునుడి విజయ గాథలను స్మరించుకోవడం పండుగలోని మర్మం.

ఉత్తరం వైపు ఊరేగింపులు

ప్రాంతాల వారీగా తెలంగాణలో వివిధ రీతుల్లో వేడుకలు జరుపుకుంటూ, ఆనంద డోలికల్లో మునగటమే దసరా పండుగ ప్రధాన లక్ష్యం. దండకారణ్యంలో ఉన్న పంచవటి, తెలంగాణ సహ్యాద్రి పర్వతశ్రేణి, దక్షిణం వైపు ఆదిలాబాదు మొదలు భద్రాచలం వరకు, పెన్‌గంగ, వర్ధా, ప్రాణహిత, గోదావరీ, మంజీరాల తీరప్రాంతాల్లో నదికి ఒడ్డున జమ్మి కొమ్మలను నాటడం ఆనవాయితీ. ఆయా గ్రామాల ప్రజలంతా శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పల్లకీసేవలో భజనలు చేస్తూ, నృత్యాలతో, ఉత్తరం వైపు పయనిస్తూ వెళ్తారు.

జమ్మిఆకుల బంగారం

ఊరి పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామప్రజలు అంతా కూడి సమూహంగా బయలు వెళ్లి, జమ్మిపూజ గావిస్తారు. ఉమ్మడి కుటుంబాల నుండి దూర ప్రాంతాలకు వివిధ విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళ్ళిన సభ్యులంతా దసరా పండుగ కోసం పుట్టిన ఊరికి చేరి ఆనందాన్ని అనుభవిస్తారు.

చిన్ననాటి అనుభవాలను నేస్తాలతో పంచుకుంటారు. పూజించిన జమ్మి ఆకులను ‘బంగారం’గా భావిస్తూ ఇచ్చి పుచ్చుకుంటారు. పిల్లలు పెద్దల ఆశీస్సులు పొందుతారు. సమవయస్కులు ఆలింగనం చేసుకుంటారు. 

భద్రాచలం, కాళేశ్వరం, వేములవాడ, మందిని, చెన్నూరు, ధర్మపురి, అచలాపురం, కన్నెపల్లి వంటి బ్రాహ్మణ ఆగ్రహారాల్లో అయితే విద్యావంతులు, గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులు కులగురువులను, బ్రాహ్మణులను పిలిపించుకుని వేదాశీర్వాదం పొందడం ఆనవాయితీ. విద్యార్థులు జమ్మి ఆకుల  బంగారాన్ని తమ పుస్తకాల్లో, వ్యాపారులు గల్లా పెట్టెలలో భద్రపరిచి సంతోషపడుతారు.

రక్షణ కోసం ఆయుధ పూజలు

‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని రామాయణం చెప్పినట్లు క్షమాగుణం, సత్యం ధర్మం, సుపరిపాలన, ఎటువంటి కరువు కాటకాలు రాకుండా రక్షించమని భగవంతుని కోరుకోవటం భారతీయ సనాతన సంస్కృతికి ఆయువు పట్టు. అందులో భాగంగా శ్రీ సీతా రామచంద్రుల పూజ, ఊరేగింపు అనూచానంగా వస్తున్నది.

దీనికితోడు రక్షకభట నిలయాల్లో ఆయుధ పూజలు, వివిధ వృత్తులు సాగించే కర్మచారులు నాగలి, గొడ్డలి, కొడవలి, గడ్డపార, పార వంటి పనిముట్లు అలంకరణ పూజ అధికంగా ఉంటుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, మంత్రశక్తి స్వరూపాలుగా వాహన, యంత్ర పూజలు జరిపించి ఆనందం పంచుకుంటారు.

పాలపిట్ట దర్శనం చేసుకోవటం దసరా పండుగ ప్రత్యేకం. అది కనిపించే వరకు అలా పొలాల వెంట జనం తండోప తండాలుగా వెళుతూనే ఉంటారు. కనిపించగానే ‘పాల! పాల!!’ అనే హాహాకారాలు మిన్నుముడతాయి. ఈ దసరా నాటి ప్రజల ఆనందం నిజంగా అక్షరాలకు అందనిది.

 మాడుగుల నారాయణమూర్తి 

9441139106