స్వరాష్ట్ర సాధనకోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ‘నవంబర్ 29’ తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు. ప్రజలలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రజ్వలింపజేసిన రోజు. మొక్కవోని దీక్షతో చావు నోట్లో తలపెట్టి స్వరాష్ట్ర స్వప్నాన్ని ముద్దాడిన కేసీఆర్ దీక్షకు నేటికి 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2009 మలి దశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పోయారు. ‘తాను సచ్చుడో.. తెలంగాణ తెచ్చుడో’ అన్న ఉక్కు సంకల్పంలో ఆయనలో కనిపించింది. డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడటంతో 11 రోజులపాటు ఆమరణ దీక్ష చేసిన కేసీఆర్ తర్వాత విరమించారు. తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ దీక్ష సాగిన తీరు అక్షరమక్షరం చర్రితకెక్కింది.
కరీంనగర్ నుంచి సిద్దిపేట సమీపంలోని రంగధాంపల్లిలో ఏర్పాటైన దీక్షాస్థలికి ఆయన బయలుదేరారు. పోలీసులు వాహనాన్ని ముట్టడించడమేకాక ఆమరణ నిరాహార దీక్షా స్థలి వద్దకు వెళ్లకుండా అడ్డుకునే ప్ర యత్నం చేశారు. ఆయన రోడ్డుపైనే ధర్నా చేయడంతో ఖమ్మం జైలుకు తరలించారు. అక్కడా ఆయన దీక్షను కొనసాగించారు. ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో డిసెంబర్ 1న తాను లేకున్నా సరే ఉద్యమం నడపాలని ప్రకటించారు. డిసెంబర్ 2న పార్లమెంట్‌లో కేసీఆర్ దీక్షను బీజేపీ అగ్రనేత అద్వానీ ప్రస్తావించారు.
ఆరోగ్యం మరింతగా క్షీణించటం తో కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్ కు తరలించారు. డిసెంబర్ 4న ‘తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్ర’ అని కేసీఆర్ తెగించి, ప్రకటించారు. సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్, ఉద్యమ నేతలు దీక్ష విరమణకు ఎన్ని విజ్ఞప్తు లు చేసినా ససేమిరా అన్నారు. సబ్బండ వర్గా లు పోరుబాట పట్టా రు. ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. పది రోజులపాటు రగిలిన బోనం.. కుండలో బెల్లం బువ్వ అయ్యింది. కేసీఆర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆందోళనలు వెల్లువెత్తాయి.
బంద్ లు జరిగాయి. ఒక్కసారిగా ఉద్యమం ఎగిసిపడింది. ఎటు చూసినా ‘జై తెలంగాణ’ నినాదాలే. వరుస బంద్‌లతో రైళ్లు, బస్సులు ఎక్కడివక్కడే స్తంభించాయి. సబ్బండవర్ణాలు ఒక్కటయ్యారు. వృద్ధుల నుంచి చిన్నపిల్లాడి వరకు రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమంలో పాల్గొన్నా రు. ఒత్తిడి కొనసాగుతున్న వేళ.. నాటి పాలకులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించక తప్పలేదు. డిసెం బర్ 7న అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయి.
8న రాష్ట్ర ఏర్పాటు దిశగా సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. 9న కాంగ్రె స్ కోర్ కమిటీ ఐదుసార్లు సమావేశమైంది. ‘తెలంగాణ రాష్ట్రం ఇస్తు న్నట్లు’గా సోనియాగాంధీ సూచనతో నాటి కేంద్ర హోంమం త్రి చిదంబరం ప్రకటించారు. 11 రోజుల సుదీర్ఘ దీక్షతో తెలంగాణను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కింది.
ఆయన నిరాహార దీక్ష చరిత్రపుటల్లో నిలిచిపోయింది. ‘దీక్షా దివస్’ గా నవంబర్ 29 ప్రజల హృదయా ల్లో స్థిరపడింది. రాష్ట్ర సాధనకు ఒక తిరుగులేని ఊతమయ్యిందనడంలో ఎవరికీ ఏ సందేహమూ లేదు. తర్వాత జరిగిన పరిణామాలు అం దరికీ తెలిసినవే. అయితే, గెలుపైనా, ఓటమి అయినా తాత్కాలికమే అన్న స్పృహ ప్రతి ఒక్కరికీ అవసరం.
- డా. సంగని మల్లేశ్వర్
సెల్: 9866255355