జాతీయ విద్యా దినోత్సవం
2008, నవంబర్ 11: స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 11న భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మౌలానా ఆజాద్ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు. దేశంలో విద్యా వ్యవస్థను రూపొందించిన పండితుడు. భారత ప్రభుత్వం నవంబరు 11 జాతీయ విద్యాదినోత్సవంగా ప్రకటించింది. మొదటి వేడుకలను 2008 నవంబర్ 11న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రారంభించారు
‘కుందర డిక్లరేషన్’
1809, నవంబర్ 11: కేరళలోని ఒక పట్టణం కుందర. ఇది కొల్లం మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగం. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నందున కుందర ముఖ్యమైన ప్రాంతంగా పేరొందింది. అయితే 1809 బ్రిటిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని కేరళలోని వేలుతంపి ప్రజలకు పిలుపునిచ్చింది. దీనిని ‘కుందర డిక్లరేషన్’గా పిలుస్తారు.
స్వతంత్ర దేశంగా కొలంబియా
1811 నవంబర్ 11: విభిన్న ప్రాంతాలు, వాటి అపారమైన వృక్షసంపద, జంతుజాలం, సాంస్కృతిక, కళాత్మక వారసత్వ సంపదకు పెట్టింది పేరు కొలంబియా. 1811 నవంబర్ 11న కొలంబియా దేశం స్పెయిన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది. ఆనాటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ, ఎన్నో దేశాలను ఆకర్షిస్తూ పర్యాటక ప్రాంతంగానూ పేరుతెచ్చుకుంది.