calender_icon.png 14 October, 2024 | 3:49 AM

చరిత్రలో నేడు

14-10-2024 12:00:00 AM

అంబేద్కర్ బౌద్ధమతం స్వీకరించిన రోజు

1956 అక్టోబర్ 14: శాంతి, సమానత్వం బోధించే బౌద్ధమతం అంటే తనకు ఎంతో ఇష్టమని భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ ఎన్నో వేదికల మీద పలుమార్లు ప్రస్తావించారు. స్వతహాగా హిందువు అయిన అంబేడ్కర్.. బుద్ధుడి బోధనలకు ఆకర్శితుడయ్యాడు. అయితే ఆయన నాగపూర్‌లో నిర్వహించిన ఓ భారీ కార్యక్రమంలో బౌద్ధమతం స్వీకరించారు.

దాదాపు 3.65 లక్షల మంది మద్దతుదారులతో కలిసి 1956 లో సరిగ్గా ఇదే రోజున బౌద్ధమతం స్వీకరించారు. తనతో పాటు బౌద్ధమతం స్వీకరించిన వారి కోసం అంబేడ్కర్ 22 ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా హిందూ మతంలో ఆచరించే ధర్మాలు, పూజా పద్ధతులను పూర్తిగా విడనాడుతున్నట్లు ప్రమాణం చేయించారు. 

ఈజిప్ట్ అధ్యక్షుడిగా హోస్ని ముబారక్ 

1981 అక్టోబర్ 14: హోస్ని ముబారక్.. ఈజిప్టు రాజకీయ నాయకుడు. సైనిక అధికారి కూడా. ఆయన ఈజిప్ట్ అధ్యక్షుడిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టింది ఈరోజే. అతను 1981 నుంచి 2011 వరకు ఈజిప్టుకు నాలుగు పర్యాయలు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు, ముబారక్ ఈజిప్టు వైమానిక దళంలో కీలక అధికారిగా పనిచేశారు.

1972 నుంచి 1975 వరకు దాని కమాండర్ గా పనిచేశాడు. 1973లో ఎయిర్ చీఫ్ మార్షల్ స్థాయికి ఎదిగాడు. 1805 నుంచి 1848 వరకు 43 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన మొహమ్మద్ అలీ పాషా తర్వాత ఈజిప్ట్‌కు ఎక్కువ కాలం పనిచేసిన పాలకుడిగా నిలిచాడు.

న్యూక్లియర్ టెక్నాలజీకి నేపాల్ ఆమోదం

2007 అక్టోబర్ 14: వైద్య, వ్యవసాయ రంగాల్లో న్యూక్లియర్ టెక్నాలజీని ఉపయోగించేందుకు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నేపాల్‌కు ఆమోదం తెలిపింది.