calender_icon.png 9 October, 2024 | 5:58 AM

నేడు గోధ్వజస్థాపన

09-10-2024 03:04:53 AM

హైదరాబాద్ చేరుకున్న ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి

స్వామీజీకి స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాల్, శంకరాచార్య స్వాగత కమిటీ తెలంగాణ  చైర్మన్, ‘విజయక్రాంతి’దినపత్రిక చైర్మన్ చిలప్పగారి లక్ష్మీరాజం 

రవీంద్రభారతిలో గో ధ్వజస్థాపన కార్యక్రమానికి గో రక్షకులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని లక్ష్మీరాజం పిలుపు 

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం గో మాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలనే నినాదంతో దేశవ్యాప్త పర్యటన సాగిస్తున్న ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ మంగ ళవారం  హైదరాబాద్ చేరుకున్నారు.

అన్ని రాష్ట్రాల రాజధానుల్లో గోధ్వజ స్థాపన చేయాలని సంకల్పించిన స్వామీజీ, గత నెల 22న రామ జన్మభూమి అయోధ్య నుంచి ‘గో ధ్వజ్ స్థాపన భారత్ యాత్ర’ ప్రారంభించారు. అక్టోబర్ 26 వరకు 36 రోజుల పాటు పర్యటించాలని  శంకరాచార్య సంక ల్పించారు. దీనిలో భాగంగానే స్వామీజీ హైదరాబాద్ వచ్చారు.

విమానాశ్రయంలో స్వామీజీకి శంకరాచార్య స్వాగత కమిటీ తెలంగాణ చైర్మన్, ‘విజయక్రాంతిదినపత్రిక చైర్మన్ చిలప్పగారి లక్ష్మీరాజం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాల్ స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ లక్ష్మీరాజం ఇంటికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా లక్ష్మీరాజం మాట్లాడుతూ.. రవీంద్రభారతిలో బుధవారం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి తో పాటు గోపాల్ మణి జీ మహరాజ్ గో ధ్వజస్థాపన చేయనున్నారని తెలిపారు. గో మాత రక్షకులు, గోమాత రక్షకులు పెద్ద సం ఖ్యలో కార్యక్రమానికి విచ్చేయాలని లక్ష్మీరాజం పిలుపునిచ్చారు.

గోవును జంతువుగా చూసే సంస్కృతి పోయి.. గోవును తల్లిగా చూసే సంస్కృతిని తెచ్చేందుకు స్వామీజీ గోధ్వజ స్థాపన భారత్ యాత్ర చేపడుతున్నారని, కార్యక్రమానికి భారీగా తరలివచ్చి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

నేటి కార్యక్రమాలు..

బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు స్వామీజీ లక్డీకాపూల్‌లోని రవీంద్రభారతికి చేరుకుని తొలుత గోపూజ చేస్తారు. 12:15 గంటలకు స్వామీజీ  సమక్షంలో వేదికపై కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 1: 45 గంటలకు స్వామీజీకి మంగళహారతి, పాద పూజ, సమన్వయకర్తలకు సత్కార కార్యక్రమం ఉంటుంది. తర్వాత స్వామీజీ అనుగ్రహ ప్రవచనం ఉంటుంది. అనంతరం నిర్వాహకులు ప్రసాద వితరణ చేస్తారు. 2 గంటలకు స్వామీజీ మీడియా సమావేశం నిర్వహిస్తారు.

స్వామీజీ యాత్ర ఇలా..

సెప్టెంబర్ 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి గోధ్వజ స్థాపన భారత్ యాత్ర ప్రారంభమైంది. 23న స్వామీజీ లక్నోకు చేరుకుని గో ధ్వజస్థాపన చేశారు. 24న బీహార్ రాజధాని పాట్నా, 25న సిక్కిం రాజధాని గాంగ్‌టక్‌లో గో ధ్వజస్థాపన చేశారు. అనివార్య కారణాలతో అరుణాచల్‌ప్రదేశ్, నాగల్యాండ్‌లో స్వామీజీ పర్యటనలు రద్దయ్యాయి. 27న స్వామీజీ మణిపూర్ రాజధాని ఇంఫాల్, 28న మేఘాలయ రాజధాని షిల్లాంగ్ గో ధ్వజ స్థాపన చేశారు. 29న పశ్చిమ బెంగాల్‌కు చేరుకుని కోనానగర్ రాజరాజేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. 

గోవును రాష్ట్రమాతగా ప్రకటించిన మహారాష్ట్ర సర్కార్..

స్వామీజీ పర్యటనలో ఉన్న సమయంలోనే సెప్టెంబర్ 30న మహారాష్ట్ర ప్రభుత్వం గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించింది. గోశాల నిర్వాహకులకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే రోజు జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ముంబైకి చేరుకున్నా రు.

స్వామీజీకి ఆ రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి రవీంద్ర స్వాగతం పలికారు. ఈ నెల 1న స్వామీజీని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సత్కరించారు.  2న స్వామీజీ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చేరుకున్నారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 3న హావ్‌డా శంకర్‌మఠ్‌లో అనుగ్రహ ప్రవచనమిచ్చారు.

4న జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 5న రాంచీలోని రాణిసతి ఆలయంలో గోధ్వజ స్థాపన చేశారు. 6న ఒడిశా రాజధాని భువనేశ్వర్, 7న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్, 8న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో గోధ్వజ స్థాపన చేశారు. 8న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో గోధ్వజ స్థాపన చేసి, మర్నాటి నుంచి మిగిలిన రాష్ట్రాల రాజధానుల్లో పర్యటిస్తారు.

స్వామీజీ డిమాండ్లు ఇవీ..

దేశంలో గో హత్యలను పూర్తిగా నివారించాలి. అందుకు ప్రత్యేకమైన చట్టాలు తేవాలి. గోవును జంతువుగా భావించడం పాపం. కాబట్టి గోవును రాష్ట్ర జాబితా నుంచి తొలగించాలి. గోమాతగా కేంద్ర జాబితాలో చేర్చాలి. యావత్ దేశమంతా గోవును గౌరవించాలంటే గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలి. దీనిపై గెజిట్ ప్రకటించాలి. లౌకికవాద ప్రభుత్వాలని చెప్పుకొనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ మత స్థలాలను ధర్మాచార్యులు స్వతంత్రంగా నిర్వహించే స్వేచ్ఛనివ్వాలి. మతపరమైన అంశాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దు.