- 20 బస్తీల్లో 20 మంది ముఖ్యనేతలు
- అంబర్‌పేట తులసీరాంనగర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బస్తీ నిద్ర
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కార్ మూసీ ప్రక్షాళన పేరిట ఇండ్ల కూల్చివేతను నిరసిస్తూ బీజేపీ పలు ఆందోళనలు చేస్తోంది. ఈ క్రమంలో ‘మూసీ ప్రజల కష్టాలు బీజేపీ నేతలకేం తెలుసు, ఒక్కరాత్రి అక్కడి గడిపి చూస్తే బస్తీ వాసుల సమస్యలు తెలుస్తాయి’ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరించిన టీబీజేపీ నేతలు నేడు మూసీనదీ పరీవాహక ప్రాంతంలోని 20 బస్తీల్లో నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు.
కేంద్రమంత్రి, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సైతం మూసీనిద్ర చేయనున్నారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంట ల వరకు మూసీ వద్దే ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు.
20 బస్తీల్లో 20 మంది ముఖ్య ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ బస్తీనిద్రలో స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, మూసీ పరిధిలోని 8 జిల్లాలకు సంబంధించిన బీజేపీ అధ్యక్షులు కూడా పాల్గొంటారు.