calender_icon.png 21 April, 2025 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిస్వార్థ మహోద్యమ నేత

15-03-2025 12:00:00 AM

నేడు బీమిరెడ్డి నరసింహారెడ్డి జయంతి

భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి పాత్ర ఎన్నదగింది. తెలంగాణలో  ‘బి.ఎన్.రెడ్డి’గా ఆయన విశేష ప్రాచుర్యం పొందారు. ‘దున్నే వాడిదే భూమి’ అని నినదించి వంద ఎకరాల స్వంతభూమిని పేదలకు పంచిన నిస్వార్థ త్యాగశీలి ఆయన. అనేక ప్రజాపోరాటాల్లో నడుం బిగించి ప్రజాభ్యున్నతికి అహర్నిశలూ పాటుపడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా (ప్రస్తుత సూర్యాపేట) తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెంలో పెద్ద భూస్వామ్య కుటుంబంలో 1922 మార్చి 15న భీమిరెడ్డి రాంరెడ్డి చొక్కమ్మ దంపతులకు నరసింహారెడ్డి జన్మించారు. సంపన్న కుటుంబంలో పుట్టినా తన ఆలోచనలు, ఆశయా లు మాత్రం సమసమాజం సాధన వైపే సాగాయి. భూస్వాములు, జమీందారుల నిరంకుశత్వానికి, వెట్టిచాకిరికి, రజాకారుల అరాచకాలు, అకృత్యాలకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పో రాటంలో ‘నిరంతర సేనాని’గా నిలిచారు.

భీమిరెడ్డి భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ)లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1957లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. సీపీఐ చీలిన తర్వాత ఆయన సీపీఐ (మార్క్సిస్ట్)లో చేరారు. 1967లో సూర్యాపేట నియోజక వర్గం నుంచి శాసనసభ్యులుగా గెలుపొందారు. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరసింహారెడ్డి సీపీఎం పార్టీనుంచి తొలిసారి పోటీ చేసి పార్లమెంట్ సభ్యులయ్యారు. 1977, 1980లలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందినా, 1984 లోక్‌సభ ఎన్నికల్లో నాలు గోసారి పోటీ చేసి, రెండో పర్యాయం ఎంపీగా పార్లమెంటులో ప్రవేశించారు.

1989 లోక్‌సభ ఎన్నికల్లోనూ మరోసారి ఓటమి పాలైనా, 1991 లోక్‌సభ ఎన్నికల్లో ఆరవసారి పోటీ చేసి మూడోసారి పార్లమెంట్ సభ్యులయ్యారు.  చట్టసభలకు ఆయన ఎప్పుడూ ప్రభుత్వ వాహనాలలోనే ప్రయాణించారు. పాతిక సంవత్సరాలపాటు మచ్చ లేని ‘కమ్యూనిస్టు ప్రజాప్రతినిధి’గా పేరొందారు. ఈతరం నాయకులు ఇలాంటి నేతల జీవితాలనుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ‘ఆకలిదప్పులు, అసమానతలు లేని సమ సమాజం కావాలి’ అని పరితపించిన ఆయన చివరకు 2008 మే 9న తుదిశ్వాస విడిచారు. భారత కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలోనే ఆదర్శ నాయకునిగా ఆయనది చెక్కుచెదరని స్థానం.

- జె.జె.సి.పి. బాబూరావు