calender_icon.png 17 January, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం

08-08-2024 12:20:22 AM

  1. మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పాటు
  2. 15 మంది సలహాదారులతో పాలన
  3. సైన్యాధ్యక్షుడు వాకెర్ ఉజ్జమా ప్రకటన 

ఢాకా, ఆగస్టు 7: బంగ్లాదేశ్‌లో నోబెల్ పురస్కార గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం గురువారం కొలువుదీరనున్నది. గురువారం రాత్రి 8 గంటలకు కొత్త ప్రభుత్వం ప్రమాణం చేస్తుందని బంగ్లా సైన్యాధ్యక్షుడు వాకెర్ ఉజ్జమాన్ బుధవారం ప్రకటించారు. ఫ్రాన్స్‌లో ఉన్న యూనస్ గురువారం మధ్యాహ్నం ఢాకా చేరుకొంటారని చెప్పారు. 15 మంది సలహాదారులతో కూడిన కౌన్సిల్‌కు యూనస్ నాయకత్వం వహిస్తారని వెల్లడించారు.

ఆ పదవి చేపట్టేందుకు యూనస ఆసక్తిగా ఉన్నారని, దేశాన్ని ఆయన అద్భుతమైన ప్రజాస్వామ్య మార్గంలోకి తీసకెళ్తారని భావిస్తున్నట్టు చెప్పారు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసిన విద్యార్థుల డిమాండ్ మేరకు యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ఆ దేశ సైన్యం, ప్రతిపక్ష పార్టీలు అంగీకరించాయి. కాగా, ఉద్యోగుల సంక్షేమ నిధిని ఏర్పాటుచేయటంలో విఫలమైనందుకు యూనస్‌కు బంగ్లాదేశ్ కోర్టు జనవరిలో విధించిన ఆరు నెలల జైలు శిక్షను రద్దుచేసినట్టు ఆయన న్యాయవాది బుధవారం తెలిపారు. యూనస్‌కు చెందిన గ్రామీణ్ టెలికం కంపెనీలోని ఉద్యోగుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాల్సి ఉండగా, అందులో యూనస్ విఫలమయ్యారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు: ఖలేదా

షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసిన విద్యార్థులు, యువతను ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధినేత్రి ఖలేదా జియా అభినందించారు. గృహనిర్బంధం నుంచి విడుదలైన తర్వాత ఆమె మొదటిసారి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘నా ఆరోగ్యం బాగుండాలని మీరు ఎప్పుడూ కోరుకొన్నారు. నేనిప్పుడు మీతో మాట్లాడుతున్నానంటే అదంతా భగవంతుడి దయ. ఫాసిస్ట్ ప్రభుత్వం నుంచి మనం విజయవంతంగా స్వాతంత్య్రం సాధించాం. ఇందుకోసం ప్రాణాలర్పించిన వీరులకు నివాళులర్పిస్తున్నాను. ఈ దేశ యువత, విద్యార్థులు అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేశారు. అన్ని మతాలను సమానంగా గౌరవించే ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌ను నిర్మిద్దాం’ అని ఆమె పిలుపునిచ్చారు.