calender_icon.png 20 October, 2024 | 6:41 PM

హత్తుకొని ఎత్తుకొనేలా..

24-07-2024 12:00:00 AM

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వనాథ్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం నుంచి ఈమధ్యే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘సితార’ ఇటు సంగీతాభిమానులను, అటు సినీ సాహిత్య ప్రియులను ఓలలాడింపజేసింది. ఈ పాటకు యూత్ కనెక్ట్ అయిన తీరు గురించి వేరే చెప్పక్కర్లేదు. సాహితి రాసిన ఈ సాంగ్ కోసం మిక్కీ జే మేయర్ సమకూర్చిన స్వరాలకు అనుగుణంగా హీరోహీరోయిన్ మధ్య పండిన కెమిస్ట్రీ ఈ పాటను మరో స్థాయిలో నిలబెట్టాయి. ముఖ్యం గా ఈ పాటలో భాగ్యశ్రీ బోర్సే గ్లామరస్ లుక్ యువతను రాత్రింబవళ్లూ వెంటాడిందంటే అతిశయోక్తి కాదు.

అలాంటి పాటే మరొకటి విడుదలకు సిద్ధంగా ఉందంటూ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్..  మంగళవారం ఎక్స్ వేదికగా ప్రకటించిన మరుక్షణం నుంచి అభిమాన నాయిక నాట్య భంగిమలను మరోమారు చూసే ‘భాగ్య’ం కలుగుతోందన్న భావనతో ఉంది కుర్రకారు. ‘హత్తుకోని ఎత్తుకోవే.. ఆశాభోంస్లే మత్తురాగమే..’ అంటూ కాసర్ల శ్యామ్ రాసిన సెకండ్ సింగిల్ లిరిక్స్‌ను డైరెక్టర్ రివీల్ చేసిన తీరు చూస్తుంటే నిజంగానే ఈ పాట.. ఆశాభోంస్లే మత్తు రాగంలా గమ్మత్తున అనుభూతి పంచటం ద్వారా చిత్రబృందాన్ని అభిమానులు తమ భుజాలపైకి ఎత్తుకునేలా చేస్తుందనైతే తెలుస్తోంది. సాహిత్యమే హత్తుకునేలా ఉందంటే ఈ పాటలో భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఊహించొచ్చు. ఈ నెల 25న విడుదల కానున్న ఈ ‘రెప్పల్ డప్పుల్’ పాటలో రవితేజ డ్యాన్స్ ఫోర్‌ను అదరగొట్టనున్నట్టు సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను చూస్తే అర్థమవుతోంది.