19-04-2025 12:00:00 AM
మన శరీరానికి గాయమైనప్పుడు కొంత కాలానికి చికిత్స జరిగాక మానుతుంది. హృదయానికి అయిన గాయం కూడా అలాగే మానాలి. కాకపోతే, చికిత్స సహృదయ స్పర్శతో మాత్రమే సాధ్యమవుతుంది. నా అనుభవం నాకే నేర్పిన పాఠం ఇది. ఇప్పుడు నా అభిమాన పాఠకుల కోసం దీనిని రాస్తున్నాను. సుప్రసిద్ధ కవి డా. ఎన్. గోపికి, నాకు మధ్య జరిగిన ఒక అవాంఛనీయ సన్నివేశం.
విశ్వవిద్యాలయాలలో తరచుగా సెమినార్లు జరుగుతుంటాయి. వర్సిటీలోని అధ్యాపకులతోపాటు బయటి కళాశాల ఆచార్యులు కూడా సెమినార్లలో భాగస్వాములవుతుంటారు. ఇలాంటి సంగోష్టీ కార్య క్రమాలకు యూజీసీనుంచి ఆర్థిక సహా యం అందుతుంది. అప్పుడప్పుడు విశ్వవిద్యాలయాలే ఆర్థిక వనరులను కల్పిస్తాయి. నిర్వాహకులైన ఆచార్యులు పత్ర సమర్పణ వ్యక్తులను ఎన్నుకుంటారు. ముందే పత్రాలను తెప్పించుకుని పుస్తకరూపంలో అచ్చువేసి, సెమినార్లలో ఆవిష్కరిస్తారు.
మా తెలుగుశాఖలో నేను పని చేసిన 26 ఏళ్లలో ఎన్నో సెమినార్లు జరిగాయి. రాయప్రోలు, కృష్ణశాస్త్రి, జాషువా, సినారె, సువరం, పల్లా దుర్గయ్య వంటవారిపై ఎన్నో సెమినార్లు జరిగాయి. నేను స్వయం గా పోతనపై సెమినార్ నిర్వహించాను. ప్ర ముఖ వ్యక్తులను బయటినుంచి ఆహ్వానిం చి, వారికి కొంత పారితోషికమూ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా ఎవరు శాఖాధ్యక్షులైనా, వారి హయాంలో ఒకటి, రెండు సెమినార్లు తప్పక జరగ వలసిందే. కొన్నిసార్లు పరిశోధక విద్యార్థులు తమకు లభిం చే స్కాలర్‌షిప్‌ల డబ్బు సమకూర్చడమూ జరుగుతుంది.
బయటి వ్యక్తులు విరాళాలు అందజేసి సెమినార్లను జరిపించే విధానం కూడా ఉంది. నేను బెంగళూరు, తిరుపతి, రాజమండ్రి, వరంగల్లు వంటి ప్రాంతాలకు వెళ్లి ఆయా విశ్వవిద్యాలయాల సెమి నార్లలో పాల్గొని, పరిశోధనా పత్రాలను సమర్పించాను. ఆ పరిశోధనా పత్రాలను పుస్తకంగా కూడా ప్రచురించాను. ‘సమాలోచనం’, ‘సారస్వత లోచనం’ సంపుటా లు అలా వచ్చినవే. తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగే సెమినార్ల లోనేకాక వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయ పీఠం ఆధ్వర్యంలో జరిగిన వాటిలోనూ పాల్గొనే భాగ్యం నాకు కలిగింది.
జరగకూడనిది జరిగింది!
మా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి జరిగే అన్ని సెమినార్లలో నేను పాల్గొనేవాణ్ణి. ఒకసారి సుప్రసిద్ధ కవి డా. ఎన్.గోపి ఓ సెమినార్ డైరెక్టరుగా ఉన్నారు. నన్ను జాషువాపై పత్ర సమర్పణ చేయమన్నారు. ముందుగా పత్రాన్ని అందించమన్నారు. నేను కొంత కాలయాపన చేసిన మాట నిజం. అందువల్ల “పేపరు తొందరగా రాయమని” వారు నన్ను పదేపదే కోరారు. కాలం నాతో ఆ పని చేయించలేకపోయింది. దాంతో జరగకూడనిది జరిగింది. హృదయాలు గాయపడే పరిస్థితులు ఏర్పడింది.
విశ్వవిద్యాలయంలో ఒక పద్ధతి ఉంది. నిజంగా ప్రతిభ ఉంటే ప్రోత్సహించడం ఒకటి. ప్రతిభ లేకపోయినా మెచ్చుకోవడమూ ఉండేది. రాగద్వేషాలకు విశ్వవిద్యాలయ అధ్యాపకులేమీ అతీతులు కారు. తమకు నచ్చిన వారిని మెచ్చుకోవడం, నచ్చని వారిని నొచ్చుకోవడం పరిపాటి. గోపి సార్ నన్ను ఒక పండితునిగా చాలాసార్లు ప్రశంసించారు.
నేను కూడా ఆయన మనస్ఫూర్తిగా నన్ను మెచ్చుకుంటున్నారనే భావించాను. నిజానికి ఆయన ప్రతిభనుబట్టే విలువ ఇచ్చేవారు. ఆయన దృష్టిలో నేను మంచికవినే కాదు, మంచి పరిశోధకుడిని కూడా. పాండిత్యానికి వస్తే, గుండేరావు హర్కారే దగ్గర సంస్కృత కావ్యాలు చదువుకున్నాను కాబట్టి, నన్ను చాలావరకు పండితుడనే అంటారు.
కమ్యునికేషన్ గ్యాప్ ప్రభావం
“మీరు పత్రం తొందరగా రాసి ఇవ్వండి. అన్ని పత్రాలు ప్రెస్సులో అచ్చు అవుతున్నాయి. మీదే ఆలస్యం..” అన్నారు ఎన్.గోపి ఒకరోజు. వారి మాటలనుబట్టి నాకర్థమైంది ఏమంటే, ‘సమయం లేదు కాబట్టి, పత్రాన్ని రాసి వెంటనే ప్రెస్సులో ఇవ్వాలని’. నిజానికి పద్ధతి ప్రకారమైతే పత్రం రాసి సార్‌కు ఇవ్వాలి. కానీ, ‘సమయం లేదని అంటున్నారు కనుక, నేనే రాసి స్వయంగా ప్రెస్సులో ఇస్తే బాగుంటుందనే’ అభిప్రాయం నాకు కలిగింది. అంతేకానీ, వారికి ముందుగా పరిశోధనా పత్రాన్ని ఇవ్వకూడదన్న ఉద్దేశ్యం నాకు ఏ కోశాన లేదు.
నేను పత్రం రాసి ప్రెస్సులో ఇచ్చేశాను. ఆ తర్వాత విషయం తెలుసుకున్న గోపి సార్ నాకు ఫోన్ చేశారు.
“పత్రం నాకు కదా ఇవ్వాలి! నేరుగా ప్రెస్సులో ఇస్తే ఎలా? ఇది నన్ను అగౌరవ పరిచినట్లు కాదా?” అన్నారు. అక్కడితో నేను మౌనంగా విని ఊరుకుని ఉంటే పోయేది.
“మిమ్మల్ని అగౌర పరచాలన్న ఉద్దేశ్యం నాకు లేదు సార్. మీరే పరిశోధనా పత్రాలు ప్రెస్సులో అచ్చు అవుతున్నాయి, తొందరగా ఇవ్వాలని అన్నారు కదా అని..” అన్నాను.
“ప్రెస్సులో అచ్చవుతున్నాయి అన్నాను కాని, మిమ్మల్ని నేరుగా అక్కడే ఇవ్వమని చెప్పలేదు కదా?..” అన్నారు మళ్లీ. అవును, ఇదీ నిజమే. కానీ, మరో రకంగా అర్థం కావడం నా దురదృష్టం కాకపోతే మరేమిటి?!
“సమయం లేదనడంతో నేనే ప్రెస్సులో ఇచ్చాను. అంతేతప్ప, మీకు ముందుగా ఇవ్వరాదనే అభిప్రాయం నాది కాదు..” అనీ అన్నాను.
వారప్పుడు కొంచెం సీరియస్‌గా
“మీరు పండితులని అనుకుంటున్నాను. కాని, ఔచిత్యం తెలియాలి కదా?” అన్నారు. దానికి నేనిచ్చిన సమాధానంతో వారు ఖంగు తిన్నారు.
“సార్! మీరే నన్ను పండితునిగా ఎన్నోసార్లు ప్రకటించారు. నా సామర్థ్యాన్ని గుర్తించారు. అలాంటప్పుడు నేను నా పత్రాన్ని మీకివ్వకుండా ప్రెస్సులో ఇచ్చాను. ఇంత మాత్రానికి ఆవేశానికి లోను కావాలా?” అని గట్టిగానే అన్నాను.
“ఓహో! నా మాటలు నాకే అప్ప చెప్పావా? సరే పత్రం ఎలాగైతేనేమి నాకు వచ్చింది. పత్రం బాగుంది కాబట్టి, నేనేమీ అనవలసింది లేదు. ఉంటాను..” అని ఫోను పెట్టేశారు వారు.
‘కమ్యునికేషన్ గ్యాప్’ అనేమాట తరచుగా వింటుంటాం. గోపి సార్‌కు నాకు మధ్య అదే జరిగింది. సమయం అనేది లేదు కనుక పత్రం రాసి ప్రెస్సులో ఇవ్వమని అన్నట్లుగా నాకర్థమైంది, ఆ పనే చేశాను. అంతేగాని, నా సహాధ్యాపకుల పట్లగాని, గురువులపట్ల గాని ఎలాంటి ద్వేషభావం నాలో లేదు. ఉండదు కూడా. ఐతే, మనలను ఒకసారి మెచ్చుకున్నవారు, మరొకసారి నొచ్చుకుంటే కలిగే బాధ నాకు అప్పుడే అనుభంలోకి వచ్చింది. అందుకేనేమో, నేను ఆ సమయంలో కొంచెం ఎక్కువగా మాట్లాడాను.
వ్యాసకర్త: ఆచార్య మసన చెన్నప్ప, సెల్: 9885654381