02-03-2025 12:08:34 AM
‘జమిడిక’ లేదా జముకు తాళానికి అనుగుణంగా వాయించే వాద్యం. దీనిని ఒకప్పుడు చెక్కతో తయారుచేసేవారు. తర్వాత ఇత్తడితో చేస్తున్నారు. ఇలా తయారుచేసిన జమిడికని ఒకవైపు చర్మంతో మూస్తారు. ఒక నరాన్ని ‘గట్’ తాడుని చర్మానికి బిగిస్తారు. అది కుంచంలోంచి పైకివస్తుంది. ఈ తాడుకి చివరన ఒక కర్రముక్క కడతారు. కుంచాన్ని చంక కింద పెట్టుకుంటారు. ఈ చేత్తోనే తాడు కొనకు కట్టిన కర్రముక్కను లాగి పట్టుకుని ఇంకో చేత్తో ఈ తాడుని మీటుతూ దానికి అనుగుణంగా పాడుతుంటారు. వాద్యాన్ని మీటుతున్నప్పుడు కర్రముక్కకు కట్టిన తాడుని విదిలిస్తూ, కదుపుతూ ఉంటారు. దానివల్ల పుట్టిన ధ్వని కొంత భీకరంగా, తాళయుక్తంగా ఉంటుంది.
జముకు వాద్యాన్ని తెలంగాణలో బవనీలు అనే బైండ్లవారు వాయిస్తారు. కళింగాంధ్రలో జముకు వాయించే సంప్రదాయం ఉంది. సుబ్బారావు పాణిగ్రాహి లాంటి వారు జముకుపై విప్లవ గీతాలు పాడారు. జముకు, దానిని వాయించే బవనీల (బైండ్ల) ప్రసక్తి ‘క్రీడాభిరామం’ గ్రంథంలో ఉంది. వీరు ఎల్లమ్మ కథ చెప్పడంలో ప్రసిద్ధులు. వీరు మాదిగలకు ఉపకులం. ముగ్గురు లేదా నలుగురి బృందం కథ చెబుతుంది. ప్రధాన కథకుడు అనేక బాణీలలో, శైలులలో కథనం చేస్తాడు. ప్రధాన కథకుడు వేపమండలు పలకలు పట్టుకుంటాడు. భుజంపై వీరగోల వేసుకుంటాడు. ప్రత్యేక ఆహార్యం ఏదీ లేకపోయినా ఏదో ఒక మార్మికత ఆవరిస్తుంది. ముఖ్యంగా అది వాద్యం సృష్టించే శబ్దాల వల్లే వస్తుంది. పక్కనున్న వంతలు జమిడికలు పట్టుకుని కథని కొనసాగిస్తారు. కథకుడు కథ చెప్పేటప్పుడు ఎల్లమ్మ పురాణంలో వచ్చే వివిధ పాత్రలను అభినయిస్తాడు. మొత్తం కథలో ఒక లయాత్మక తూగు వినిపిస్తుంది. నృత్యంలో, కథ చెప్పడంలో జమిడిక వాయించడంలో ఈ లయఏ పాటించబడుతుంది.
ఈ శబ్దం ప్రత్యేకత..
ఈ వాద్యాన్ని వింటుంటే శ్రోతలకు శరీరం జిల్లుమంటుంది. జుమ్ చుక్.. జుమ్ చుక్.. అంటూ వినిపించే శబ్దం ఒక రకమైన ప్రత్యేక సంగీతమై అలరిస్తుంది. వీరు కొలుపులు చేస్తూ తమకు హక్కుగా వచ్చిన నలభై గ్రామాల పట్టీలో సంచారం చేస్తారు. ఆ గ్రామాలు వీరికి మిరాశి హక్కుగా ఉంటాయి. గురువులుగా, క్రతుకర్మకాండలు నిర్వహించే పూజారులుగా గౌరవం అందుకుంటారు. జమిడికను మాలవారు, మాదిగవారు తమ కథాగానంలో ఉపయోగిస్తారు. ఎల్లమ్మ వంటి ఇతర గ్రామ దేవతల కథలు చెబుతారు. పంబ తెరచీరల వారి వీరణాలు ఒకే మాదిరిగా ఉంటాయి. ఐతే గానాన్ని బట్టి అవి మోగుతాయి. ఎవరి సంగీత ముద్ర వారిదే.!