హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు నిర్వహించే ఎస్‌ఏ-1(సమ్మెటివ్ అసెస్‌మెంట్) పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి 28 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు పాఠశాల డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 1-5 తరగతులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంట వరకు, 6వ తరగతి వారికి ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7వ తరగతి వారికి మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, 8వ తరగతి వారికి 9.15 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, పదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నట్టు డైరెక్టర్ పేర్కొన్నారు. నవంబర్ 2 వరకు జవాబు పత్రాలను ఉపాధ్యాయులు మూల్యాం కనం చేసి, నవంబర్ 5 వరకు రికార్డుల్లో మార్కులను అప్‌లోడ్ చేయాలని తెలిపారు. నవంబర్ 16న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.