పెళ్లున కొత్తలో భార్యాభర్తలు ప్రతి విషయాన్నీ పంచుకుంటారు. క్రమంగా ఆ అలవాటు తగ్గుతుంది. అయితే దీనివల్ల తమ మధ్య దూరం పెరిగిందేమో అని భాగస్వామిలో భయం పెరిగే అవకాశం ఉంది. దంపతుల మధ్య అనుబంధం పెరగాలే తప్ప, తరగకూడదంటున్నారు నిపుణులు. పెళ్లున కొత్తలో ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రక్రియలో ఉంటారు. నెమ్మదిగా ఇరువురి బలహీనతలు, లోపాలు బయటకొస్తే, విమర్శించుకోవడం మొదలు పెడతారు. ఒకరి బలహీనతలను మరొకరు తెలుసుకొని నడుచుకోవాలనే ఆలోచన రాదు. అవతలివారిలో లోపాలనే చూస్తారు తప్ప, మంచి విషయాలను గుర్తించరు. బలహీనతలకే ప్రాముఖ్యతనిస్తారు. క్రమేపీ ఇది ఇరువురి మధ్య దూరాన్ని పెంచుతుంది.
దాంతో ఆ బంధం బీటలువారుతుంది. దంపతుల్లో ఎవరు మాట్లాడినా ఎదుటి వారు చెప్పేది పూర్తిగా వినాలి. అప్పుడే వారి మనసేంటో అర్థమవుతుంది. అలాకాక ఆసక్తి చూపించలేకపోతే, అవతలి వారికి మరోసారి ఏ అంశాన్నీ ప్రస్తావించాలనిపించదు. అప్పుడిక వారి సమస్యలను చెప్పడానికి కూడా ముందుకు రారు. తమ అభిప్రాయంతో ఏకీభవించకపోయినా, కనీసం వింటున్నారనే సంతృప్తి కలుగుతుంది. ఆ తర్వాత ఎందుకు ఏకీభవించలేకపోతున్నాననే దానిపై సున్నితంగా వివరణ ఇవ్వాలి. ఇవి చర్చను ప్రశాంతంగా ముగిసేలా చేస్తాయి.