విశ్వాస తీర్మానంలో ఓడిన నేపాల్ ప్రధాని
కాఠ్మాండు, జూలై 12: నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహాల్ (ప్రచండ) పార్లమెంటు విశ్వాసం కోల్పోయారు. శుక్రవారం ఆయన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంలో ఆయన ఓడిపోయారు. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అవిశ్వాస తీర్మానంపై నిర్వహించిన ఓటింగ్‌లో ప్రచండకు అనుకూలంగా 63 ఓట్లురాగా, వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. ఆయ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవటంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం ఓడిపోయింది. నేపాల్ పార్లమెంటులో 275 ఎంపీ సీట్లు ఉన్నాయి. విశ్వాస పరీక్ష నెగ్గాలంటే కనీసం 138 ఎంపీల మద్దతు అవసరం. కానీ ఆయనకు అందులో సగం కూడా రాలేదు. షేర్ బహదూర్ దేవ్‌బా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్‌తో అధికారాన్ని పంచుకొనేందుకు మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని సీపీఎన్ యూఎంఎల్ ఒప్పందం చేసుకోవటంతో ప్రచండ ప్రభుత్వానికి ఓలీ వారం క్రితం మద్దతు ఉపసంహరించుకొన్నారు.