28-02-2025 01:10:02 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి): దట్టమైన అడుగులో నివాసాలు ఏర్పరచుకుంటే మౌలిక సదుపాయాల ఏర్పాటు సాధ్యం కాదని, కుటుంబాలను రోడ్డుకు చేరువలో మార్చుకోవాలని, అప్పుడే మౌలిక సదుపాయాలు కల్పించడం సులభతరం అవుతుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం పునుకోడు చెలక గ్రామపంచాయతీ పరిధిలోని చింతలమేది ,మద్ది గుంపు గుత్తి కోయ ఆవాసాలలో గుత్తి కోయిల జీవనస్థితిగతులను , వారికి అందుతున్న మౌలిక వసతుల గురించి తెలుసుకునుటకు గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా కలెక్టర్ మిషన్ భగీరథ ఈ ఈ తిరుమలేష్ తో కలసి గుత్తి కోయ ఆవాసాలకు ద్విచక్ర వాహనం మీద చేరుకున్నారు. అనంతరం ఆయన ఆవాసాలలో త్రాగునీరు కొరకు ఏర్పాటు చేసుకున్న చెలమలను పరిశీలించారు. అక్కడ ఉన్న గుత్తి కోయిల తో ముచ్చటించి వారి యొక్క జీవన విధానం , స్థితిగతులను, ఉపాధి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వారితో అటవీ సంపదను కాపాడాలని, పోడు కొట్టడం చట్ట వ్యతిరేకమని, ఎవరు చెట్లను నరకరాదని సూచించారు. గుత్తి కోయిల అభివృద్ధి కొరకు నిత్యం కృషి చేస్తున్నామని, విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. త్రాగునీరు, మౌలిక వసతులు కల్పించడానికి సరైన రహదారి మార్గం కూడా లేనందున చింతలమెది లో నివసించే 6 కుటుంబాల వారు రోడ్డుకు చేరువుగా రావాలని తద్వారా అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు అందిస్తామని కలెక్టర్ సూచించారు.
గ్రామస్తులు త్వరలో తమ నిర్ణయం తెలియజేస్తామని కలెక్టర్ కు తెలిపారు. గ్రామంలో త్రాగునీరు కోసం సంపు నిర్మాణం చేపట్టాలని మిషన్ భగీరథ ఈఈని ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఎంపీడీవో చలపతిరావు, మిషన్ భగీరథ డి ఈ శివయ్య, ఏఈ వెంకటస్వామి, పంచాయతీ కార్యదర్శులు, అటవీ శాఖ అధికారులు మరియు స్థానికులు పాల్గొన్నారు.