calender_icon.png 5 January, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాట్రిక్ కొట్టాలని..

19-07-2024 12:23:38 AM

విశ్వక్రీడల్లో మరే భారత అథ్లెట్‌కు సాధ్యంకాని ఫీట్ నమోదు చేసేందుకు తెలుగు తేజం పీవీ సింధు సమాయత్తమవుతోంది. ఒలింపిక్స్‌లో ఇప్పటికే రెండు పతకాలు (రజతం, కాంస్యం) సాధించిన సింధు ఈ సారి పతకం రంగు మార్చడంతో పాటు.. వరుసగా మూడో విశ్వక్రీడల్లో మెడల్స్ నెగ్గిన ఏకైక భారత అథ్లెట్‌గా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరో ఏడు రోజుల్లో మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. సింధుతో పాటు అమలాపురం కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ కూడా పతకంపై ఆశలు రేపుతున్నాడు. 

గత మూడు ఒలింపిక్స్‌లో కనీసం ఒక్కో పతకం అందించిన బ్యాడ్మింటన్‌లో మరోసారి మెరిసేందుకు మన షట్లర్లు సిద్ధమవుతున్నారు. మహిళల సింగిల్స్‌లో ఇప్పటికే రెండు పతకాలు (2016; రజతం.. 2020; కాంస్యం) సాధించిన పీవీ సింధు.. పారిస్‌లో పసిడి పట్టడమే లక్ష్యంగా సాగుతోంది. గత కొంతకాలంగా పురుషుల డబుల్స్‌లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న సాత్విక్ సాయిరాజ్ శెట్టిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

విశ్వక్రీడల చరిత్రలో ఇప్పటి వరకు భారత్‌కు మూడు పతకాలు రాగా.. ఆ మూడు మహిళల సింగిల్స్‌లోనే దక్కాయి. పీవీ సింధు రెండు మెడల్స్ తేగా.. అంతకుముందు సైనా నెహ్వాల్ కాంస్యంతో మెరిసింది. అయితే ఈ సారి పురుషుల విభాగంలో పతకం దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సింగిల్స్‌లో లక్ష్యసేన, హెచ్‌ఎస్ ప్రణయ్ పోటీ పడుతుండగా.. డబుల్స్‌లో సాత్విక్ జంట ఆశలు రేపుతోంది. ఇక మహిళల డబుల్స్‌లో తనీషాతో కలిసి సీనియర్ ప్లేయర్ అశ్విని పొన్నప్ప బరిలోకి దిగనుంది.