రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క
ఎల్బీనగర్, అక్టోబర్ 15 : జువెనైల్ కేంద్రాల్లో ఉండే పిల్లలు మంచి నడవడికను అలవరచుకోవాలని, తద్వారా ఉత్తమ పౌరులుగా ఎదగాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మంత్రి సీతక్క మంగళవారం సైదాబాద్‌లోని జువెనైల్ హోంలో మహిళా శిశు సంక్షేమశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, డైరెక్టర్ కాంతి వెస్లీ, మహిళాభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ శోభారాణితో కలిసి బ్యాగులు, దుస్తులు అందించి మాట్లాడారు.
జువెనైల్ హోంలు పరివర్తన కేంద్రాలని, ఇక్కడ ఉంటున్న పిల్లలకు శిక్ష ఉండదన్నారు. పిల్లలు ఇకపై చిన్న పొరపాటు కూడా చేయొద్దని సూచించారు. ఇక్కడికి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో? ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. జువెనైల్ కేంద్రంలో లైబ్రెరీ, యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పిల్లల ప్రతిభకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇప్పించాలని జువెనైల్ కేంద్ర అధికారులకు ఆమె సూచించారు.