calender_icon.png 30 September, 2024 | 6:07 AM

3 నుంచి ‘ఏడుపాయల’ శరన్నవరాత్రులు

30-09-2024 01:46:40 AM

పాపన్నపేట సెప్టెంబరు 29: పాపన్నపేట ఏడుపాయల వనదుర్గాభవానీ సన్నిధిలో వచ్చే నెల 3వ తేదీ నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. తొలిరోజు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు.

ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తారన్నారు. అలాగే 4న గాయత్రిగా, 5న అన్నపూర్ణగా, 6న వనదుర్గగా, 7న మహాలక్ష్మిగా, 8న దుర్గాగా, 9న సరస్వతిగా, 10న మహిషాసురమర్థినిగా, 11న సర్వ నారాయణిగా, చివరి రోజు 12న విజయ దశిమి సందర్భంగా రాజరాజేశ్వరిదేవీగా వనదుర్గమ్మ దర్శనమిస్తారని తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో భాగంగా భక్తుల కోసం ప్రతి రోజు అన్నదానం నిర్వహిస్తామన్నారు. 

ఆరోరోజూ జలదిగ్బంధంలోనే

ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం ఆరు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. మంజీరా నది పొంగి సింగూరు ప్రాజెక్టుకు వరద పోటు తగిలింది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు దిగువకు జలాలు విడుదల చేశారు. దీంతో దిగువన ఉన్న ఆలయం ముంపునకు గురైంది. ఆలయ అధికారులు ఆలాయాన్ని మూసివేయాల్సి వచ్చింది. భక్తుల దర్శనార్థం అమ్మవారి విగ్రహాన్ని రాజగోపురం లో ఏర్పాటు చేశారు. భక్తులు బయటి నుంచి అమ్మవారిని దర్శించుకుని వెనుదిరుగుతున్నారు.