- పోలీసు విచారణకు కేటీఆర్ సహకరించాలి
- బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): కేసుల నుంచి తప్పించుకునేందుకే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఆయన పోలీసుల విచారణకు సహకరించాలని కోరారు.
సోమవారం ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడారు. ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి విచారణ కోసం 15 రోజుల క్రితమే గవర్నర్ అనుమతి కోరామని తెలిపారు. తాము ఎవరినీ జైల్లో పెడతామని అనలేదని చెప్పారు.
తనను తాను రక్షించుకేనేందుకు కేటీఆర్ కేంద్రం వద్ద మోకరిల్లెందుకు వెళ్లి.. అమృత్ పథకం మీద ఫిర్యాదు చేసేందుకు వెళ్లానని ప్రజల దృష్టిని మరల్చుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అన్న విధంగా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు.
అమృత్‌లో అవినీతి జరిగితే కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చు.. కానీ, మీ మీద జరిగే విచారణను ఆపుకొనేందుకు వెళుతున్నట్టు తెలుస్తోందని విమ ర్శించారు. పోలీసుల విచారణకు సహకరించి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. కార్ రేసింగ్‌పై ఏసీబీ విచారణ జరుగుతోందని, ఇప్పటికైనా కేటీఆర్ తప్పు ఒప్పుకొంటే మంచిదని అన్నారు.
ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో అక్రమాలపై చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టంచేశారు. ఈ నెల 14 నుంచి వచ్చే నెల 9 వరకు ఏడాది పాలన విజయోత్సవాలను జరుపుతున్నామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న విజయోత్స వాలను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు.