ఇదేరోజు నల్లగొండ జిల్లాలో మంత్రుల పర్యటనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫైర్
- ఉద్యోగాల్లో అనాదిగా బీసీలకు అన్యాయం
- అగ్రకులాల ఓట్లు మాకొద్దు.. బీసీల ఓట్లు మీకొద్దని చెప్పగలరా?
- మిర్యాలగూడకు లక్ష్మారెడ్డే చివరి ఓసీ ఎమ్మెల్యే
- బీసీ గర్జన సభా వేదికగా ఎమ్మెల్సీ ఆగ్రహం
నల్లగొండ, నవంబర్ 3 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బీసీ గర్జన సభను తొక్కిపెట్టేందుకే ఆదివారం దామరచర్ల మండలంలో మంత్రులు పర్యటన పెట్టుకున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు.
పత్రికల్లోనూ సభ వార్తకు ప్రాధాన్యం దక్కకుండా ఎత్తుగడ వేశారని ధ్వజమెత్తారు. మిర్యాలగూడ ఎన్నెస్పీ క్యాంపు మైదానంలో ఆదివారం జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. అనాధిగా ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీలంటే బిగ్ క్లాస్‌గా ఆయన అభివర్ణించారు.
అగ్రకులాల ఓట్లు తమకొద్దని.. బీసీల ఓట్లు తమకు వద్దంటూ అగ్రకులాల వారు చెప్పగలరా? అని సవాల్ విసిరారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కే నేతలను భవిష్యత్‌లో గెలవనివ్వబో మని హెచ్చరించారు. తెలంగాణ వచ్చినా నల్లగొండలో బీసీల బతుకులు మారకపోవడం శోచనీయమని అన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీనే గెలిపించాలి
రానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు సంఘటితంగా బీసీ అభ్యర్థిని గెలిపించాలని తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాలపై ఎమ్మెల్సీగా గెలవలేదని, తన పనితనం నచ్చలేదని ప్రజలు చెబితే వెంటనే పదవి రాజీనామా చేస్తానని స్పష్టంచేశారు.
మిర్యాలగూడలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుట్రలు కుతంత్రాలు చూశామని, ఇక్కడి నుంచి ఆయనే చివరి ఓసీ ఎమ్మెల్యే అవుతారని జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి గెలిచేది బీసీ అభ్యర్థేనని పేర్కొన్నారు. మిర్యాలగూడ సభ ఆరంభం మాత్రమేనని, అసలు ఉద్య మం పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభిస్తామని చెప్పారు.
త్వర లో రాష్ట్రంలో మరిన్ని సభలు పెడతామని, బీసీలను సంఘటితం చేసి రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాడతామని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. బీసీ నాయకులంతా పార్టీలకతీతంగా ఏకం కావాల ని సూచించారు.
అంతకుముందు పలువురు బీసీ నేతలు మాట్లాడుతూ.. ఆర్థిక, సామాజిక రంగాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలు హక్కుల సాధనలో మాత్రం వెనుకబడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో శాసనమండ లి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సూర్యాపేట జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టే జానయ్యయాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజుయాదవ్, బీఆర్‌ఎస్ నేత చెరుకు సుధాకర్, ఐఏఎస్ అధికారి చిరంజీవి, బీపీ మండల్ మనుమడు సూరజ్ మండల్, పుట్ట మధు, ఆకుల లలిత, తండు సైదులు, సభా అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్, కోల సైదులు, గుడిపాటి కోటయ్య, సండ్రాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.