కరీంనగర్ (విజయక్రాంతి): బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మొండిచెయ్యి చూపిన కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతూనే ఉన్నదని మాజీ మేయర్ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్ మండిపడ్డారు. అన్ని అర్హతలు ఉన్నా గతంలోనూ దరఖాస్తు చేసుకున్నా జాబితాలో పేర్లు రాలేదని, లబ్ధిదారులుగా ఎంపిక చేసిన వారికి రశీదు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు, రైతుభరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు కేవలం ఎన్నికల స్టంట్ కోసమే అని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు అనర్హులను ఎంపిక చేశారని, రుణమాఫీ, పింఛన్లు అందడం లేదని, మహాలక్ష్మి డబ్బులను ఎప్పుడు పంపిణీ చేస్తారని అధికారులు, ప్రజాప్రతినిధులపై ఆయా గ్రామస్తులు ప్రశ్నల వర్షం కురిపించడమే కనిపించిందని ఆయా గ్రామాల్లో ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు, పజాప్రతినిధులు తలలు పట్టుకున్నారని, పలుచోట్ల సర్వే సరిగ్గా లేదని, అవకతవకలు జరిగాయని అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవరిస్తుంది. ఉన్నవారికే ఇండ్లిస్తరా..? గరీబోళ్లను పట్టించుకోరా..? అంటూ సర్ధార్ రవీందర్ సింగ్ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రజా సమస్యలను పరిగణనలోకి తీసుకుని గ్రామ సభల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పారదర్శకంగా దృష్టిసారించి అర్హులకే పథకాలను అమలు చేయాలని సర్ధార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో గుంజపడుగు హరిప్రసాద్, ఎడ్ల అశోక్, పోన్నం అనీల్ గౌడ్, కెమసారం తిరుపతి, పెండ్యాల మహేష్, మేకల చంద్రశేఖర్ యాదవ్, తూల భాస్కర్ రావు తదితరులు ఉన్నారు.