- సీపీ ఆఫీస్‌ను డీజీపీ కార్యాలయంలోకి మార్చాలని డిమాండ్
- ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీపీ కార్యాలయం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (విజయక్రాంతి): సిటీ పోలీస్ బాస్ కార్యాలయాన్ని నాంపల్లిలోని ప్రస్తుత డీజీపీ కార్యాలయంలోకి మార్చాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది. దీంతో సాధారణ ప్రజలకు సీపీకి మధ్య గ్యాప్ పెరిగిందని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ప్రజలు నేరుగా డీజీపీని కలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి డీజీపీ కార్యాలయాన్ని సీపీ కార్యాలయంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.
సీపీని కలవడానికి కష్టంగా..
పోలీసు అధికారులు, ప్రభుత్వ పెద్దలు సమలోచనలు జరిపి వీలైనంత త్వరగా సీపీ కార్యాలయాన్ని నాంపల్లిలోని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సౌత్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ ఈస్ట్ జోన్, సౌత్ వెస్ట్‌జోన్ ఇలా 7 జోన్లలో కలిపి సుమారు 70 వరకు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ క్రమంలో పలు పోలీస్ స్టేషన్లలో జరిగే చర్యలు సీపీకి తెలియజేయాలంటే ఇబ్బందిగా మారుతోంది. దీంతో కొందరు అవినీతి అధికారులు విచ్చలవిడిగా ప్రజలను దోచుకుంటున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
ఈ మధ్య కాలంలో బషీర్‌బాగ్ సీసీఎస్‌లో ఏసీపీగా విధులు నిర్వహించిన ఉమామహేశ్వర్ రావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడటం, ఈవోడబ్ల్యూ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ఏకంగా బషీర్‌బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదురుగానే లంచం తీసుకుంటూ పట్టుబడడం పోలీస్ శాఖపై నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి. అలాగే కొన్ని దూర ప్రాంతాలలో ఉన్నవారికి సీపీని కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామంటే కలవడానికి కష్టంగా మారిందని, బంజారాహిల్స్ ప్రాంతం ఎప్పుడు ట్రాఫిక్ రద్దీతో ఉంటుంది కాబట్టి గంటల కొద్దీ ట్రాఫిక్ వలయంలో చిక్కుకోవాల్సి వస్తుందంటున్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత సీపీ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు మరింత ఇబ్బందిగా మారాయంటున్నారు. ప్రజలతో పాటు సీపీకి కూడా సిటీలోని ఏదైనా పోలీస్‌స్టేషన్‌కి అత్యవసరంగా వెళ్లాలంటే రెండు, మూడు గంటల సమయం పడుతుందని ఓ అధికారి తెలిపారు.
ప్రజా దర్బార్ నిర్వహించాలి..
ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ మహా నగరం ఈ మధ్య కాలంలో హత్య, హత్యాయత్నాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది అధికారులు ప్రజల ఫిర్యాదులను పోలీస్ స్టేషన్లలో నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ప్రజలకు ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలు చేపట్టాలి. తద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. నేరుగా సీపీకి ఫిర్యాదు అందితే ఏమైనా చర్యలు చేపడతారోనని కింది స్థాయి సిబ్బందికి కూడా భయం ఉంటుంది.
లెనిన్, విద్యార్థి, నారాయణగూడ