అమెరికా.. అదో భూతల స్వర్గం అని చాలామంది నమ్మకం. అమెరికా వెళ్తే చాలు జీవితంలో కాలుమీద కాలేసుకుని బతికే యవచ్చని చాలా మంది భారతీయ యువకులు భావిస్తుంటారు. అయితే అందరికీ రాజమార్గంలో అంటే వర్కింగ్ వీసా లభించి అగ్రరాజ్యంలో అడుగిడే అవకాశం లభించదు. అందుకే పలువురు అడ్డదారిలో ఆ దేశం వెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. ముందుగా అమెరికాకు దగ్గరగా ఉండే దేశాలకు వెళ్లి అక్కడినుంచి దొడ్డిదారుల్లో(డాంకీ రూట్) ఆ దేశంలో అడుగుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే దళారులకు వరమై పోతున్న. ఇటీవల ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెల్ల గడ్డం, మీసాలతో వృద్ధుడిగా కనిపిస్తున్న ఓ వ్యక్తి క్యూ లైన్‌లో నిలబడి ఉండగా, సిఐఎస్‌ఎఫ్ సిబ్బందికి అనుమానం వచ్చి అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బైటపడింది. 24 ఏళ్ల ఆ సిక్కు యువకుడు వృద్ధుడిగా వేషం వేసుకుని కెనడాకు, అక్కడినుంచి దొడ్డిదారిన అమెరికాకు వెళ్లాలనుకున్నాడు.
మామూలుగా అయితే అతడి అరెస్టుతో ఆ కథ ముగియాల్సింది. కానీ ఢిల్లీ పోలీసులు ఈ వ్యవహారం మూలాలు వెతకాలనుకున్నారు. దర్యాప్తులో ప్రయాణికులతోపాటు పలు దేశాలకు విస్తరించి ఉన్న ఈ నెట్‌వర్క్‌కు చెందిన ఏజంట్లు పలువురు పట్టుబడ్డారు. గత ఆరు నెలల కాలంలో పోలీసులు 108 మంది ఏజెంట్లను అరెస్టు చేశారు. 2023లో ఇదే కాలంలో అరెస్టు చేసిన 51 మందికన్నా ఇది రెట్టింపు. పంజాబ్, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర సహా దేశం అంతటా ఈ అరెస్టులు జరిగినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. భారతీయ యువకులను అమెరికాకు పంపించడానికి పలు దేశాలు భారతీయులకు ఇచ్చిన ‘వీసా ఆన్ అరైవల్’ (దేశంలోకి రాగానే వీసా జారీ చేసే) సదుపాయాన్ని ఈ ఏజంట్లు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఈ దర్యాప్తులో వెల్లడయింది. ఏజంట్ల గుట్టు రట్టు చేయడం కోసం ఢిల్లీ పోలీసులు గతంలో ప్రయాణికులను మాత్రమే అరెస్టు చేసిన కేసులను కూడా తిరగదోడడం మొదలు పెట్టారు.
ఫలితంగా ఆ కేసులతో సంబంధం ఉన్న పలువురిని కూడా అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు.అక్రమ వలసల కోసం ఈ ఏజెంట్లు నకిలీ డిపార్చర్ స్టాంపులు వేయడంతో పాటు నకిలీ పాస్‌పోర్టులు, వీసాలు, వర్క్ పర్మిట్లు లాంటివి ఎలా సృష్టించారో పోలీసుల దర్యాప్తులో బయటపడింది. వేరే వాళ్ల పాస్‌పోర్టులపై ఆదే రూపు రేఖలతో ప్రయాణికులను పంపడానికి యత్నించిన 24 మంది ఏజంట్లను గత ఆరు నెలల్లో పోలీసులు పట్టుకున్నారు.. ముందుగా వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందించే దేశాలకు, అక్కడినుంచి అమెరికాకు పంపిస్తామని ఏజెంట్లు ప్రయాణికులను నమ్మిస్తారు. అలా వారిని కజకిస్థాన్, అజర్‌బైజాన్ లాంటి దేశాలకు పంపిస్తారు. తర్వాత మధ్యఅమెరికా దేశాల మార్గంలో అమెరికా సరిహద్లుకు చేరుస్తారు. ఈ ప్రయాణం అంతా సజావుగా ఉండదు. బస్సుల్లో ఒక్కోసారి, చిన్నచిన్న పడవల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. చివరికి అమెరికా సరిహద్దుకు చేరుకున్నా అక్కడి అధికారుల చేతికి నెలల తరబడి డిటెన్షన్ సెంటర్లలో బందీలుగా ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత అధికారులు దయతలచి వెనక్కి పంపితే ఫరవాలేదు. లేదంటే వాళ్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇలా 11 నెలల పాటు డిటెన్షన్ సెంటర్‌లో ఉండి స్వదేశానికి తిరిగివచ్చిన ఓయువకుడు తానుపడ్డ కష్టాలువెల్లడించాడు.
అమెరికా వెళ్లడం కోసం తాను 5060 లక్షలు ఖర్చు చేసినట్లు కూడా ఆ యువకుడు చెప్పాడు. గత ఏడాది రికార్డు స్థాయిలో 96, 917 మందిని వెనక్కి పంపించినట్లు అమెరికా కస్టమ్స్, సరిహద్దు రక్షణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే కొన్ని వేల మంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి ఉండవచ్చని కూడా ఆ లెక్కలు చెబుతున్నాయి. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారిలో భారతీయులు మూడో స్థానంలో ఉండడం గమనార్హం. ఇలా అక్రమంగా అమెరికాకు తరలించే ఏజంట్ల భరతం పట్టినట్లయితే ఈ ప్రమాదకర ప్రయాణంలో ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడవచ్చు.