న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పార్లమెంట్‌లో విపక్షాల డిమాండ్లతో సోమవారం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. అనంతరం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్డున ఖర్గే చాంబర్‌లో విపక్ష ఇండియా కూటమి ఎంపీలు సమావేశమయ్యారు. ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎదుర్కొనే వ్యూహంపై తీవ్ర చర్చలు జరిపారు.
అయితే ఈ భేటీకి కూటమిలో భాగమైన తృణమూల్ కాంగ్రెస్ గైర్హాజరు అయింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ వంటి అంశాలు పార్లమెంట్‌లో చర్చించాలని టీఎంసీ భావిస్తోందని, అయితే కాంగ్రెస్ మాత్రం అదానీ అంశమే ఎజెండాగా చేసుకుంటోందని ఆ పార్టీ నేత ఒకరు వెల్లడించారు. అందువల్ల ఈ మీటింగ్‌కు టీఎంసీ డుమ్మా కొట్టినట్లు జాతీయ మీడియా పేర్కొంది.