27-03-2025 12:00:00 AM
టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్- ఇండియా సినిమాను సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మించడం ద్వారా వెంకట సతీశ్ కిలారు సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. వెంకట సతీశ్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి సినిమా ఇదే.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. జగపతిబాబు, దివ్యేందుశర్మ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటివరకూ ‘ఆర్‌సీ16’ అనే మేకింగ్ టైటిల్‌తో పట్టాలెక్కిన ఈ సినిమాకు ‘పెద్ది’ అనే పేరుతో తెరకెక్కనుందన్న ప్రచారం జరిగింది. అయితే, ఈ చిత్ర దర్శక నిర్మాతలు మరికొన్ని గంటల్లో టైటిల్‌ను ప్రకటించనున్నారు.
ఫస్ట్ లుక్‌ను సైతం రిలీజ్ చేయనున్నారు. రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం ఉదయం 9.9 గంటలకు ‘ఆర్‌సీ16’ టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నట్టు మేకర్స్ బుధవారం ప్రకటించారు.
ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ ద్వారా సినిమాలో రామ్‌చరణ్ లుక్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు. ఈ పోస్టర్‌ను చూస్తే.. రామ్‌చరణ్ రా అండ్ రస్టిక్, రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. చేతిలో చుట్ట, పొడవైన జుట్టు, గుబురు గడ్డం లుక్‌లో రామ్‌చరణ్ దర్శనం ఇవ్వబోతున్నాడని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రానికి డీవోపీ: ఆర్ రత్నవేలు; సంగీతం: ఏఆర్ రెహమాన్.