గరుడ వాహనంపై దర్శనమిచ్చిన వైకుంఠ రాముడు...
భద్రాచలం (విజయక్రాంతి): ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య వైకుంఠ రాముడిగా వైకుంఠ ద్వార దర్శనంలో శుక్రవారం ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు భక్తులకు దర్శన భాగ్యం కలిగించి అనంతరం వాహనాలపై రాజ వీధిలో తిరువీధి సేవకు వెళ్లారు. ముందు వాహనంపై పెరియాళ్వార్ ఉండగా, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి, గజ వాహనంపై సీతమ్మ వారు, గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తుల తిరువీధి సేవ అత్యంత వైభవంగా జరిగింది. అగ్రభాగాన మేళతాళాలు, భాజా భజంత్రీలు, వేదమంత్రోచ్చారణ చేస్తు ముందుకు సాగుతుండగా ఆ వెను వెంటనే శోభాయమానంగా స్వామివారి వాహనాలు కదులుతూ వేలాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరువీధి సేవలో ఎటువంటి తోపులాటలు జరగకుండా ప్రతి వాహనం చుట్టూ రోప్ పార్టీలచే విస్తృత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముక్కోటి ఉత్సవాలు విజయవంతం అవ్వటానికి దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి, దేవస్థానం అధికారులు రవీంద్రనాథ్ శ్రావణ్ కుమార్ భవాని రామకృష్ణ సాయి బాబా శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు విశేష కృషి చేశారు.