calender_icon.png 25 October, 2024 | 7:55 AM

సుప్రీంలో తిరుపతన్న బెయిల్ పిటిషన్

25-10-2024 01:11:22 AM

ఢిల్లీ, అక్టోబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరుపతన్న తరపున న్యాయవాది పీ మోహిత్‌రావు ఈ నెల 20న పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లా ధర్మాసనం గురువారం విచారణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

మోహిత్‌రావు వాదిస్తూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ తిరుపతన్న, భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు ఈ ఏడాది మార్చి 23న అరెస్టు అయ్యారని నివేదించారు. సుమారు 211 రోజులుగా తిరుపతన్న రిమాండ్‌లో ఉన్నారని చెప్పారు. ఈ కేసులో తొమ్మిది లక్షల పేజీల ఛార్జిషీట్ (ఎఫ్‌ఎస్‌ఎల్)ను దాఖలు చేశారని, అది దాఖలు చేసి 3 నెలలైనా ట్రయల్ కోర్టు, రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేయలేదని తెలిపారు.

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, 211 రోజులుగా నిందితుడు జైలులో ఎందుకు ఉన్నారని ప్రశ్నించింది. నిందితుడు చేసిన నేరం ఏంటని ఆరా తీసింది. దీనికి మోహిత్‌రావు జవాబు చెబుతూ, ఎస్‌ఐబీ వింగ్ పిటిషనర్ ఆధీనంలో ఉంటుందని, ఫోన్ ట్యాపింగ్ చేయడం, ప్రొఫైల్ తయారు చేయడం, ఇందుకు సంబంధిచిన సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేయడం విభాగ అధినేతగా పిటిషనర్ విధి అని చెప్పారు.

ఇందులో నేరాభియోగం ఏమిటో చెప్పాలని, అంతేకాకుండా ప్రభుత్వ వాదనలు సైతం వినాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది.

హెచ్‌సీఏపై విచారణ వాయిదా

ఢిల్లీ, అక్టోబర్ 24 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వ్యవహారాలపై జస్టిస్ లావు నాగేశ్వరరావు సమర్పించిన ఏకసభ్య కమిషన్ నివేదికపై సుప్రీంకోర్టులో గురువారం విచారణకు నోచుకోలేదు. ఒకే కుటుంబ సభ్యులు 57 క్రికెట్ క్లబ్స్‌లో సభ్యులుగా ఉన్నారనే కీలక విషయాలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నివేదికలో పేర్కొన్నారు.

హెచ్‌సీఏ అక్రమాలపై సమగ్ర నివేదికపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. గురువారం విచారణకు రాలేదు. హెచ్‌సీఏలో ఒకే కుటుంబ పెత్తనం చేయడం, ఓటర్ల జాబితాలో అక్రమాలు ఇతర అంశాలపై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ నాగేశ్వరరావు ఏక సభ్య కమిటీ నివేదికపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.