calender_icon.png 20 October, 2024 | 5:17 AM

తిరుపతి ఎరుగని పల్లె!

20-10-2024 02:20:27 AM

  1. స్వామివారి పూజలకు మేడలు లేని ఇండ్లు కట్టుకున్న మల్దకల్
  2. రెండవ తిరుపతిగా పేరుగాంచిన ఆదిశిలాక్షేత్రం 
  3. పూజలు అందుకుంటున్న తిమ్మప్ప స్వామి 

  4. సాధారణంగా ప్రతి ఒక్కరు తిరుమల తిరుపతికి ఒక్కసారైనా వెళ్లాలనకుంటారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని కండ్లారా చూసి తమ మొక్కులను తీర్చుకోవాలనుకుంటారు. అంతటి ప్రాశస్త్యం కలిగిన తిరుమల అంటే తెలియని వారు ఉంటారా?.. ఉంటారు.. ఉన్నారు.. తిరుపతి అంటే తెలియని పల్లె ఒకటి మన రాష్ట్రంలోనే ఉన్నది.

ఇంతవరకు ఆ గ్రామం నుంచి శ్రీ వారిని ఎవరూ దర్శించుకోలేదు. తిరుపతి కంటే ముందే తమ పల్లెలో వేంకటేశ్వర స్వామి పాదం మోపాడని, అదే ఆది శిలాక్షేత్రంగా మారిందని వారి నమ్మకం. అలాంటి విష్ణుమూర్తిని మేడల పైనుండి మొక్కకూడదు కదా.. ఆ నమ్మకంతోనే ఆ పల్లెవాసులు ఒక్క మేడ ఇల్లు కూడా కట్టుకోలేదు.  ఇది జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉన్న మల్దకల్ పల్లె చరిత్ర

 గద్వాల (వనపర్తి), అక్టోబర్19 (విజయక్రాంతి): కలియుగంలో భక్తుల కోర్కెలను తీర్చడానికి స్వయంగా తిరుపతి ఏడు కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శిం చుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుం డా ఇతర దేశాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటారు.

అలాంటి పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఒక్కరు ఒక్కసారైనా దర్శించుకోవాలని ఆశ ఉంటుంది. అంతటి మహిమాన్వితం కలిగిన తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోని ప్రజలు, గ్రామాలు అంటూ ఉండవనే అనేవి అనుకుంటాం. కానీ తిరుపతి అంటే ఎలా ఉం టుందో తెలియని ఓ పల్లె ఉంది.

అది కూ డా తెలంగాణ రా ష్ట్రంలోని జోగుళాం బ గద్వాల జిల్లా మల్దకల్ గ్రామం. ఈ గ్రామంలోని ప్రజలు తాతల ముత్తాతల కా లం నుండి గ్రామం ఏర్పాటు నుండి నేటి వరకు ఆ పల్లెలో ఒక్కరు కూడా తిరుపతికి వెళ్లలేదు.. వెళ్ల బోరు కూడా. 

ఆది శిలాక్షేత్రంగా..  

 ఒకనాటి మొదలుకల్లుగా పిలుచుకు నే పల్లె నేడు మల్దకల్‌గామారింది. ద్వాపర యుగాంతం కలియు గ ఆరంభంలో తిరుమల తిరుపతి దేవుడి కి కన్నా ముందే విష్ణుమూర్తి ఇక్కడ ఆదిశిలపై పాదం పెట్టి ప్రవేశించడంతో ఆదిశిల అనే పేరు ఉన్నట్లు బ్రహ్మాండ పురాణంలోని నాలుగవ అధ్యాయంలో ఆధారాలున్నాయి.

ఒకప్పుడు ఈ ప్రాంతమంతా అరణ్యంగా ఉండేది. 16వ శతాబ్దంలో గద్వాల సంస్థానాధీశుడు నలసోమనా ద్రి రాజు గుర్రంపై మల్దకల్ (మొదలుకల్లు) ప్రాంతానికి వేట కోసం వచ్చాడు. ఒక చోట అతని గుర్రం అకస్మాత్తుగా ఆగిపోగా, రాజు ఆ ప్రాంతంలోనే ఏదో మహత్యం ఉందని భావిం చి దగ్గరలో ఉన్న పశువుల కాపరిని పిలిచి విచారించగా అక్కడే పొదల్లో ఉన్న విగ్రహాన్ని చూపాడు.

తన గుర్రం పరిగెత్తితే గుడి కట్టిస్తానని దేవుడి విగ్రహానికి మొక్కడంతో రాజు గుర్రాన్ని ఎక్కగానే రెట్టించిన వేగంతో తన ప్రయాణాన్ని పూర్తి చేసిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. దీంతో నల్లసోమనాద్రి రాజు ఆలయాన్ని కట్టించి ఆ విగ్రహాన్ని అందులో ప్రతి ష్టించారు. అప్పటి పశువుల కాపరైన బోయ కులస్థుడిని ఆ దేవాలయానికి పూజారిగా నియమించారు. నాటి నుంచి నేటికి ఆ పూజా రి కుటుంబసభ్యులే పూజారులుగా కొనసాగుతున్నారు. 

 రెండవ తిరుపతిగా..  

తెలుగు రాష్ట్రాల్లో రెండవ తిరుపతిగా వెలుగొందుతున్న మొదలుకల్లు (మల్దకల్) ఆదిశి లా క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో  వివరించారు. బ్రహ్మాండ పురాణంలో రాయబడిన మూడు పుణ్యక్షేత్రాలు శేషాచలం అన గా తిరుపతి, గరుడాచలం అనగా అహోబిలం, గిరిశాచలం అనగా మొదలుకల్ (మల్దకల్)గా పరిగణించారు.

మొదలు అనగా ఆది అని, కల్లు అనగా రాయి అని అర్థం, బ్రహ్మదేవుడు ఒక శిలను సృష్టించి ఆది శిల అని పేరు పెట్టాడని, అక్కడే పరమశి వుడు తపస్సు ఆచరించా డని, ఆ శిలపై శ్రీనివాసుడు, లక్ష్మీదేవి అనంతశయన మూర్తి, వరాహస్వా మి, ఆంజనేయ స్వా మి ఉద్భవించినట్లు ప్రచారంలో ఉంది.

అందుకే తిరుపతి కం టే ముందు విష్ణుమూర్తి తన పాదాల తో నడియాడిన ప్రాంతం కావడంతో ఇక్కడి గ్రామస్తులు తిరుపతికి వెళ్లరని, తల వెంట్రుకలు, మొక్కులన్నింటినీ ఇక్కడే తీర్చుకుంటా రు. ఈ ఆచారాలను ఇతర మతస్తులు సైతం పాటించడం మరో విశేషం. ఒకవే శ ఎవరైనా వెళ్లాలనే ప్రయత్నిస్తే వారికి అరి ష్టం జరుగుతుందని ప్రచారంలో సైతం ఉంది. 

మేడలు లేని పల్లె .. 

ఆదిశిలా క్షేత్రం స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర (తిమ్మప్ప) స్వామి పాదాలు మోపిన ఈ గ్రామంలో ప్రజలు ఎవ్వరూ తమ ఇండ్లపై మేడలు ( అంతస్థులు) నిర్మించరు. స్వామి వారిని ఎల్లప్పుడు కింది నుండి దర్శించుకోవాలని, ఆలయ గోపురాన్ని కూడా కింది నుండే చూడాలని, పల్లకిసేవ వంటివి సైతం నేల మీద ఉండి చూడాలన్నదే తాతల ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారం. అలాంటి ఆచారాన్ని నేటి ఆధునిక యుగంలో కూడా పాటిస్తున్నారు. ఆ గ్రామంలో నేలపై నిర్మించిన ఇండ్లకు మినహా అదనంగా ఒక్క మేడ (మొదటి అంతస్థు సైతం)ను ఇప్పటివరకు నిర్మించకపోవడం విశేషం. 

ఘనంగా బ్రహోత్సవాలు.. 

కృష్ణా, తుంగభధ్ర నదుల మధ్య గల గద్వాల జిల్లాలోని మల్దకల్ గ్రామంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులను తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో మార్గశిర పంచమి రోజు నుంచి మార్గశిర కృష్ణ తదియ వరకు (నెలరోజుల పాటు) స్వామి వారి బ్రహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.