calender_icon.png 14 October, 2024 | 8:39 PM

తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

14-10-2024 06:53:53 PM

విజయవాడ: తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనాలపై తుఫాన్ ప్రభావం పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎల్లుండి వీఐపీ బ్రేక్ దర్శనాలు టీటీడీ రద్దు చేసింది. కొండకు వచ్చిన భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనుంది.  ఘాట్ రోడ్డులో కొండచరియలపై నిఘా ఉంచాలి.. జేసీబీలు, అంబులెన్స్‌లు సేవలు సిద్ధంగా ఉంచాలని ఈవో శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. అటు ఏపీలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 17 వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన విద్యాశాఖ ఈ నాలుగు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. 

ఆంధ్రప్రదేశ్ తుఫాన్ పరిస్థితులపై మంత్రి నారాయణ సోమవారం సాయంత్రం సమీక్షించారు. మున్సిపల్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుఫాన్ చెన్నై-నెల్లూరు మధ్య ఈ నెల 17న తుఫాన్‌ తీరం దాటుతుందని అంచనా వేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.