calender_icon.png 23 October, 2024 | 7:03 PM

ఆగస్టులో తిరుమలకు పండుగ శోభ

29-07-2024 12:52:46 AM

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): ఆగస్టులో తిరుమల క్షేత్రానికి శ్రావణ శోభ రానున్నది. శ్రీవారికి నిర్వహించబోయే పండుగలు, ఉత్సవాల జాబితాను ఆదివారం టీటీడీ అధికారులు విడుదలచేశారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఆగస్టు 4న శ్రీచక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం వేడుకలను నిర్వహించనున్నారు. 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర, శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు కార్యక్రమాలు జరుగనున్నాయి. 9న గరుడ పంచమి పండగ, 10న కల్కి జయంతి, 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి నిర్వహించనున్నారు.14న శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేస్తారు.

ఇవి 15 నుంచి 17 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. 16న వర మహాలక్ష్మీ వ్రతాన్ని, నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్స వాన్ని నిర్వహిస్తారు. 19న శ్రావణ పౌర్ణమి పండగ నిర్వహించడంతోపాటు పౌర్ణమి గరుడసేవ, రాఖీ పండుగ హయగ్రీవ జయంతి, విఖనస మహాముని జయంతి నిర్వహిస్తారు. 20న తిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు, గాయత్రీ మహా మంత్రం జపం నిర్వహిస్తారు. 27న శ్రీకృష్ణాష్టమి జరుపనున్నారు. 28న శ్రీవారి శిక్యోత్సవంతో ఈ నెలవారీ వేడుకలు ముగుస్తాయి.