21-04-2025 12:00:00 AM
రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తుల వెల్లువ నాయకుల చుట్టూ యువత ప్రదక్షిణ
కరీంనగర్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో స్వయం ఉపాధి పథకాలు లేక ఏళ్లు గడుస్తుంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత, బీసీ, మైనారిటీ బంధు పథకాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం ప్రవేశ పెట్టడంతో నిరుద్యోగుల్లో స్వయం ఉపాధిపై ఆశలు చిగురించాయి. దీనితో ఈ పథకానికి కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి.
రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 న ప్రభుత్వం ఈ పథకం క్రింద రుణాలు అందించాలని నిర్ణయించడంతో దరఖాస్తు దారులు అధికార పార్టీ ఎమ్మెల్యే ల చుట్టూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట నియోజకవర్గ ఇంచార్జిల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలపై తీవ్రంగా ఒత్తిడి పెరగుతున్నది.
ప్రభుత్వం జిల్లాలకు లక్ష్యాలు విధించక పోవడంతో ఎంత మందికి లబ్ధి చేకూర్చేలా యూనిట్లు మంజూరు చేస్తుందనే విషయం తెలియడం లేదు. తాము ప్రతిపాదించిన వారికి యూనిట్లు మంజూరు కాకుంటే తమ పరిస్థితి ఏమిటనే ఆలోచనలో పడ్డారు నేతలు.
ఇన్చార్జి మంత్రి చేతికి జాబితా?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జాబితాలు అందుంచేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. రాజీవ్ యువ వికాసం పథకానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,44,640 దరఖాస్తులు రాగా, పెద్దపల్లి జిల్లాలో 47,470, కరీంనగర్ జిల్లాలో 42,565, జగిత్యాల జిల్లాలో 31,128, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 23,477 అప్లికేషన్లు వచ్చాయి.
తొలుత రేషన్ కార్డు, ఇన్కం సర్టిఫికెట్ తప్పనిసరి అని ప్రకటించడంతో కొందరు నిరాశకు లోనయ్యారు. తర్వాత నిబంధనలు సడలించడంతో వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు కేటగిరిగా విభజించారు. ఎక్కువ మంది 4 లక్షలకు సంబంధించిన రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
నాలుగు కేటగిరీల్లో..
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు గాను నాలుగు కేటగిరీల్లో ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. 50 వేల రూపాయల వరకు గల యూనిట్కు 100 శాతం సబ్సిడీ, లక్ష రూపాయల వరకు గల యూనిట్కు 90 శాతం సబ్సిడీ, 2 లక్షల రూపాయల వరకు గల యూనిట్కు 80 శాతం, 4 లక్షల రూపాయల వరకు గల యూనిట్లకు 70 శాతం సబ్సిడీ అందజేయనున్నారు.
చాలా మంది 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు గల యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ మండల, మున్సిపాలిటి అధికారులు కార్పొరేషన్లు, కేటగిరీల వారీగా వేరు చేస్తున్నారు. వాటన్నింటినీ వేరు చేసిన తర్వాత ఈ నెలాఖరు వరకు అర్హులను గుర్తించాల్సి ఉంటుంది.
మే 15 వరకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోనూ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుకు మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు.