calender_icon.png 29 April, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్ పట్టివేత

29-04-2025 12:03:02 AM

  1. నెలలోనే నాలుగుసార్లు పట్టుకున్న పోలీసులు
  2. ఇతర మార్గాల్లో సైతం తరలిస్తున్నట్లు అనుమానాలు?

మునిపల్లి, ఏప్రిల్ 28 : ఎలాంటి  అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం విజయక్రాంతి దినపత్రికలో కాసులు కురిపిస్తున్న ఇసుక దందా అనే శీర్షికన ప్రచురించిన కథనానికి పోలీసులు స్పందించారు. సోమవారం మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించగా ఎలాంటి అనుమతులు లేని ఇసుక టిప్పర్ను పట్టుకొని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.

ఇలావుండగా మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్లో ఇసుక కొనుగోలు చేస్తే కరీంనగర్ నుండి నాణ్యమైన ఇసుకను టన్నుకు రూ.2వేలకే రవాణా చేస్తున్నారు. కానీ నాణ్యతలేని ఇసుకను అక్రమార్కులు సంగారెడ్డి సమీపంలోని ఇస్మాయిల్ఖాన్ పేట నుండి టన్నుకు రూ.1200లకు కొనుగోలు చేసి జహీరాబాద్కు రూ.1600 టన్ను చొప్పున అమ్ముతున్నారు.

ఇదే ఇసుకను బీదర్లో రూ.2వేలకు టన్నుకు చొప్పున అమ్ముతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు మునిపల్లి పోలీసులు కంకోల్ టోల్ ప్లాజాను తనిఖీ కేంద్రంగా పెట్టుకున్నారు.

అయితే ఇతర రూట్లలో అక్రమార్కులు మిగతా టిప్పర్లను తరలిస్తూ ఒకటి, రెండు మాత్రం జాతీయ రహదారి గుండా తరలిస్తూ పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. కాగా ఏప్రిల్ నెలలోనే నాలుగు సార్లు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను మునిపల్లి పోలీసులు పట్టుకొని సీజ్ చేసి టిప్పర్ డ్రైవర్, ఓనర్ లను రిమాండ్ చేశారు. కాగా సోమవారం కూడా మరో టిప్పర్ను పట్టుకోవడం  జరిగిందని మునిపల్లి పోలీసులు తెలిపారు.