చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ రెడ్డి సంఘం..
ముషీరాబాద్ (విజయక్రాంతి): కులాల మధ్య వైశమ్యాలను రెచ్చగొడుతూ రెడ్డి కులస్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం డీజీపీ జితేందర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్ బద్దురి వెంటేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దేవి రెడ్డి విజితా రెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ... వరంగల్ లో జరిగిన బీసీ సభలో రెడ్డి కులాన్ని తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ మానవ సంబంధాలలో విఘాతాన్ని కల్పించే విధంగా ప్రవర్తిస్తున్న తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరారు. తీన్మార్ మల్లన్న రెడ్డి కులానికి వేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టి తీన్మార్ మల్లన్నకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.దేవేందర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, శరత్ రెడ్డి రమణారెడ్డి, సరిత రెడ్డి సుమతి రెడ్డి, గీతారెడ్డి పాల్గొన్నారు.