calender_icon.png 30 November, 2024 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిమ్స్ అంచనాలకు ఏడాదిలోనే.. రెక్కలొచ్చాయి!

08-10-2024 03:18:48 AM

మూడు టిమ్స్ భవన నిర్మాణాల అంచనాలు 883 కోట్ల పెంపు

  1. బీఆర్‌ఎస్ సర్కారు పెద్దల మౌఖిక ఆదేశాలతోనే పెంపు!
  2. 2,6౭౯ కోట్ల నుంచి రూ.3,562 కోట్లకు చేరిన వ్యయం
  3. వెలుగులోకి ఆర్‌అండ్‌బీ మాజీ ఈఎన్సీ గణపతిరెడ్డి లీలలు 
  4. ఖజానాకు భారీగా గండి 
  5. విజిలెన్స్ నివేదిక కోసం ఎదురుచూపులు

హైదరాబాద్, అక్టోబర్ ౭ (విజయక్రాంతి): సాధారణంగా ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు దానికి ఎంత ఖర్చవుతుంది? ఏమేమీ అవసరం ఉంటా యి? అని లెక్కలు వేసుకుంటాం.. కొంత ఆలస్యం జరిగితే కొంతమేర ఖర్చు పెరగడమూ చూస్తుంటాం.

కానీ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో చేపట్టిన మూడు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) నిర్మాణ వ్యయం ఏడాదిలో ఏకంగా రూ.౮౮౩ కోట్ల మేర పెంచేశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంచనాల పెంపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఈఎన్సీ గణపతిరెడ్డి హయాంలోనే ‘టిమ్స్’ అంచనాలకు రెక్కలొచ్చాయి.

నగరంలోని సనత్‌నగర్, అల్వాల్, కొత్తపేటలో గత ప్రభుత్వం టిమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. అయితే భూమిపూజ చేసిన సంవత్సరంలోనే భవనాల నిర్మాణాల్లో భారీగా ఎస్కలేషన్స్ చోటుచేసుకున్నాయి. ఎలాంటి పత్రాలు లేకుండా కేవలం మౌఖిక ఆదేశాల మేరకే ఈ మూడు టిమ్స్ నిర్మాణ అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచినట్టు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది.

దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం పేపర్ వర్క్ కూడా లేకుండా పెరిగిన అంచనాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అంచనాల పెంపులో పేరుపొందిన మాజీ ఈఎన్సీ గణపతిరెడ్డి హయాంలోనే టిమ్స్ భవనాల నిర్మాణాలు ప్రారంభమవ్వడం గమనార్హం.

అధికారుల ఇష్టానుసారంగా..  

హైదరాబాద్‌లోని సనత్‌నగర్, అల్వాల్, కొత్తపేట టిమ్స్ అంచనా వ్య యాన్ని గత ప్రభుత్వ హయాంలో అధికారులు ఇష్టానుసారంగా పెంచారనే ఆరోపణలు ఉన్నాయి. మూడింటి నిర్మాణం కోసం 2022 ఏప్రిల్‌లో జీవో జారీచేశారు. కొత్తపేట టిమ్స్‌కు రూ.900 కోట్లు, అల్వాల్‌కు రూ.897 కోట్లు, సనత్‌నగర్‌కు రూ.882 కోట్లుగా మొదట అంచనా వ్యయాన్ని చూపించారు. మూడు టిమ్స్ భవనాల కోసం రూ.2,679 కోట్లుగా అంచనా వేశారు.

ఏడాది లోపే దానిని రూ.3,562 కోట్లకు పెంచేశారు. ఫలితంగా ఖజానాకు రూ.883 కోట్ల మేర గండి పడింది. అదీ అప్పటి ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే పెంచినట్టు కాంగ్రెస్ సర్కారు గుర్తించింది. దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. వీటి నిర్మాణ పనులు అప్పటి ఈఎన్సీ గణపతిరెడ్డి పర్యవేక్షణలోనే జరిగాయి. గత పాలకుల మెప్పు కోసం అధికారులు ఇష్టానుసారం అంచనాలు పెంచి ఖజానాకు గండి కొట్టారని ఆ శాఖ అధికారులే చెప్తుండటం గమనార్హం. 

అంతా మేమే.. మాదే గొప్ప  

టిమ్స్ కోసం కొత్తపేటలోని పండ్ల మార్కెట్ స్థలాన్ని తీసుకున్న గత ప్రభుత్వం దేశంలోనే అత్యంత ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రి అంటూ ఊదరగొట్టింది. 21.36 ఎకరాల్లో 11.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 123 మీటర్ల ఎత్తుతో 27 అంతస్తుల్లో టిమ్స్ నిర్మిస్తున్నామని ప్రచారం చేసుకున్నది.  సనత్ నగర్‌లో 17 ఎకరాల్లో జీ ప్లస్ 14 అంతస్తుల్లో, అల్వాల్‌లో 28.41 ఎకరాల్లో జీ 5 అంతస్తుల్లో నిర్మాణాలను ప్రారంభించారు.

ప్రతి ప్రాజెక్టును కాళేశ్వరం తరహాలో నిర్మిస్తామంటూ ప్రచా రం చేసుకున్న గత ప్రభుత్వం ఈ టిమ్స్ విషయంలోనూ అలాగే చేసిందనే ఆరోపణలున్నాయి. ఎత్తు, పొడవు గురించి గొప్పగా చెప్తూ లోలోపలే అంచనాలు పెంచి ఖజానాకు గండి కొట్టారనే విమర్శలు వచ్చాయి. దీనిపై రేవంత్ సర్కారు ఈ ఏడాది ఆగస్టు 27న విజిలెన్స్ విచారణకు ఆదేశించగా.. నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం.