డిజైన్లను సమీక్షించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): హైదరాబాద్ రాయదుర్గం కూడలి లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఐకానిక్ టైమ్స్ స్కేర్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమీక్షించి పలు సూచనలు చేశారు.
దీనిపై ఇప్పటికే టెండర్ ప్రకటన విడుదల కాగా పలు సంస్థల తాము డిజైన్ చేసిన నిర్మాణాల ప్రెజెంటేషన్లను గురువారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ప్రదర్శించాయి. నూయార్క్ టైమ్స్ స్కేర్ తరహాలో సందర్శకులను ఆకట్టుకునేలా టీబూస్కేర్‌ను రూపొందించాలని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. భారీ ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేలు, డిజిటల్ ప్రకటనలతో ఆ ప్రాంతమంతా వెలుగులు విరజిమ్మాలని అభిప్రాయపడ్డారు.
వ్యాపారం, వినోదం, పర్యాటకంతో సందర్శకులు ఉల్లాసంగా గడిపేలా సాంస్కృతిక ప్రదర్శనలు, గాయకుల సందడి ఉండాలని చెప్పారు. 24 గంటలూ తెరచి ఉండేలా యాంఫీ థియేటర్లు, ఓపెన్ రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక థీమ్‌తో కూడిన షాపింగ్ మాల్స్ ఉండాలని కోరారు. సమీక్షా సమావేశంలో టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ కే శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు.