calender_icon.png 18 January, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సకాలంలో సబ్‌ప్లాన్ నిధుల ఖర్చు

18-01-2025 12:32:04 AM

  1. శాఖల వారీగా ప్రతినెలా ఖర్చును వెల్లడించాలి 
  2. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆదేశాలు 
  3. ఈనెల 23న మరోసారి సమావేశం 

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సంపూర్ణంగా వాడుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేసేందుకు వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలతో ఎస్సీ, ఎస్టీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు సమావేశమై ప్రణాళికలు రూపొందించాలన్నారు.

ప్రతీ శాఖలో చట్టం ప్రకారం నిధులు సకాలంలో ఖర్చు చేయాల్సిందే అని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమలు తీరుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం డిప్యూ టీ సీఎం  మాట్లాడుతూ.. శాఖల వారీగా చేసిన ఖర్చు వివరాలను నెలకోసారి వెల్లడించాలన్నారు.

ఎస్సీ, ఎస్టీల్లో ఆదాయం పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈనెల 23న నిర్వహించబోయే సమావేశానికి ప్రణాళికలతో రావాలన్నారు. సబ్‌ప్లాన్ నిధులను ఇప్పటి వరకు ఖర్చు చేయని శాఖలపై ఆరా తీశారు. ఆయా శాఖలు సబ్‌ప్లాన్ నిధుల ఖర్చులో రాబోయే రెండు నెలల్లో లక్ష్యాలను చేరుకునేందుకు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని అధికారులను ప్రశ్నించారు.

బడ్జెటేతర నిధులు ఖర్చు చేసే సమయంలోనూ ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం జనాభా దామాషాలో ఖర్చు జరిగిందా? లేదా? అన్న సంపూర్ణ సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.

సెస్ నివేదికలపై ఆరా..

ఎనిమిది సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో వివిధ శాఖల్లో అధ్యయనం చేసిన సెస్ నివేదికను సంబంధిత అధికారులు ఈ సందర్భంగా ప్రదర్శించారు. సెస్ అధికారులు పరిశీలించిన అంశాలు, సాధించిన ఫలితాలను డిప్యూటీ సీఎం ఆరా తీశారు. ఇకనుంచి సెస్ అధికారులు తమ నివేదికలను ఫైనాన్స్, ప్లానింగ్ శాఖ అధికారులకు అందజేసి వారితో తరచూ సమావేశం కావాలన్నారు.

అలాగే, అటవీ భూముల్లో సోలార్ పవర్ ద్వారా మోటార్లు వినియోగించడం, వెదురు, అవకాడో, పామాయిల్ వంటి వాటితోపాటు అంతర పంటల సాగు ప్రాజెక్టులను డిజైన్ చేయాలన్నారు. దీనికోసం ఉపాధి హామీ పథకం పనులను అనుసంధానం చేసుకోవాలన్నారు. అడవులను సంరక్షించడంతోపాటు ఆదివాసీ, గిరిజన రైతుల ఆదాయాలు పెరుగుతాయన్నారు.

మూసీ పునర్జీవనం కార్యక్రమంలో నిర్వాసితులవుతున్న ఎస్సీ, ఎస్టీ మహిళలను గుర్తించి స్వయం సహాయక సంఘ సభ్యులుగా చేర్పించి వారికి వడ్డీలేని రుణాలు అందించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రవాణా వాహనాలు, క్లీనింగ్ యం త్రాలు ఆయా వర్గాలకు అందించాలని సూ చించారు.

సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు రామకృష్ణారావు, వికాస్ రాజ్, మున్సి పల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, ఎస్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శరత్ తదితరులు  పాల్గొన్నారు.