calender_icon.png 3 October, 2024 | 10:46 PM

పత్తి కొనుగోళ్లకు సమాయత్తం

03-10-2024 12:18:40 AM

  1. కేంద్రాల ఏర్పాటుకు సీసీఐ సన్నాహాలు
  2. నల్లగొండ జిల్లాలో 5.40 లక్షల ఎకరాల్లో సాగు
  3. 43 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా 

నల్లగొండ, అక్టోబర్ 2 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో పత్తి కొనుగో ళ్లకు సీసీఐ సమాయత్తమవుతున్నది. మరో వారం రోజుల్లో మొదటి విడత పత్తి విపణిలోకి రానుండటంతో సీసీఐ కేంద్రాల ఏర్పా టుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

జిల్లాలో ఈ ఏడాది 5.40 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. 43 లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందని మార్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్రం ఈ ఏడాది పొడవు గింజ పత్తి క్వింటాకు రూ.7,521, మధ్యస్థ గింజ పత్తి క్వింటాకు రూ.7,121గా మద్దతు ధర ప్రకటించింది. ప్రస్తుతం పత్తి క్వింటా ధర బహిరంగ మార్కెట్‌లో రూ.10 వేల వరకు పలుకుతున్నది.

సర్కారు ప్రకటించిన మద్ద తు ధర కంటే బహిరంగ మార్కెట్‌లో రూ.2 వేలకుపైగా ధర అదనంగా ఉండటంతో రైతులు బహిరంగ మార్కెట్లోనే అమ్ముకునేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. కానీ కొనుగోళ్లు మొదలైన తరువాత వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరను తగ్గించే అవకాశాలు ఉండటంతో అన్నదాతలు నష్టపోకు ండా ప్రభుత్వం సీసీఐ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. 

తగ్గుతున్న సాగు విసీర్ణం

జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతున్నది. వరి సాగు విస్తీర్ణం పెరుగుతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది 5,40,022 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఇది గతేడాది కంటే 20 వేల ఎకరాలు తక్కువ.

సాగులో దిగుబడి అంతగా రాకపోవడం, ప్రతికూల పరిస్థితుల కారణంగా ఏటా రైతులు నష్టాలు చవి చూస్తున్నారు. కొన్నిసార్లు దిగుబడి ఎక్కువ వచ్చినా మద్దతు ధర లభించకపోవడం లాంటి కారణాలతో రైతులు సాగుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఏడాదికేడాది సాగు విస్తీర్ణం పడిపోతున్నది. 

ఈ నెల 3న తుది నిర్ణయం

జిల్లాలో 26 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే ఓ మిల్లును సీజ్ చేయగా మిలిగిన వాటికి అనుమతులు లేవు. అనుమతులు పునరుద్ధరించుకోవాలని ఇప్పటికే ఆయా మిల్లుల యాజమాన్యానికి మార్కెటింగ్ అధికారులు సూచించారు. జిల్లాలో ప్రథమంగా మునుగోడు, నాంపల్లి, చండూరు, హాలియా, నల్లగొండ, కొండమల్లేపల్లి, తిప్పర్తి ప్రాంతాల్లో సీసీఐ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మార్కెటింగ్, తూనికలు కొలతలు, వ్యవసాయశాఖ అధికారులు ఈ నెల 3న సమావేశమై సీసీఐ కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయలన్నదానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తరువాత కొనుగోళ్లకు సీసీఐ టెండర్లు పిలిచే అవకాశం ఉంది.

ఈ వానాకాలంలో వాతావరణం సహరించడంతో అన్ని ప్రాంతాల్లో పత్తి చేలు ఆశాజనకంగా ఉన్నాయి. ఎకరానికి 8 నుంచి 12 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశా రు. కానీ ఇటీవల కురిసిన భారీగా వర్షాలకు చాలాచోట్ల చేలు దెబ్బతినడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. 

వారం రోజుల్లో ఏర్పాటు

వారం రోజుల్లో పత్తి కొనుగోళ్లకు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. అనుమతులు లేని జిన్నింగ్ మిల్లులకు పునరుద్ధరించుకోవాలని సూచించాం. వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేలా నిఘా పెడతాం. రైతులు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. 

 ఛాయాదేవి, 

మార్కెటింగ్ శాఖ ఏడీ, నల్లగొండ