calender_icon.png 20 April, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోప కాలం

24-03-2025 12:00:00 AM

మనిషికే కాదు

కాలానికీ కోపం వస్తుంది

అసహనం పెరిగిన చోట

మొలిచేది ‘క్రోధి’ వృక్షమే!

బయటి యుద్ధం సరే

లోపలి యుద్ధాలకే 

అంతుండడం లేదు

ఎవరి విశ్వాసాలు వారివి

సహనం కోల్పోతేనే విధ్వంసాలు!

ఒకరి భుజాలమీద మరొకరు

ఎక్కే కదా ఆకాశాన్ని ముద్దాడింది

కలిసి బ్రతకడానికి అతిపెద్ద రాజ్యాంగం

ఏ కోణంలోంచి చూసినా ఉల్లంఘనలే!

అతిథితులుగా 

భూమ్మీదకు వచ్చాక

ఉన్న నాలుగు రోజులైనా

మనసారా ఒక కౌగిలింత ఒక పలకరింపు

ఆప్యాయంగా ఒక కరచాలనం!

వేదం మన తోబుట్టువు కదా

కలిసి కళకళలాడే పూలమొక్కల్లాగా

నాలుగు కాలాలపాటు మనుషులుగా

ఈ నేలమీద పరిమళించలేమా?!

ఉద్రేక ప్రసంగాలు ఎవరు విన్నా

పాదరసంలా పాకేది ఉన్మాదమే

గాయం చేయడం సులభమే

మానాలంటేనే 

కాలపరీక్షకు నిలవాలి!!