calender_icon.png 7 October, 2024 | 4:58 PM

టీ20 సిరీస్‌కు వేళాయే..

06-10-2024 12:00:00 AM

నేడు బంగ్లాదేశ్‌తో తొలి టీ20

గ్వాలియర్ వేదికగా రాత్రి 7 నుంచి

టెస్టు సిరీస్‌లో బంగ్లా నడ్డి విరిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ పొట్టి క్రికెట్‌లో కూడా బంగ్లాకు ముచ్చెమటలు పట్టించేందుకు సిద్ధమయింది. సీనియర్ల గైర్హాజరీలో సూర్యకుమార్ సారథ్యంలోని యువ జట్టు సమరోత్సాహంతో ఉరకలేస్తోంది. పిల్లులం కాదు పులులం అని విర్రవీగిన బంగ్లాకు మరోమారు పంజా రుచి చూపేందుకు టీమిండియా తహతహలాడుతోంది.  

గ్వాలియర్: భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ నేటి నుంచి ఆరంభం కానుంది. బంగ్లాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2 తేడాతో క్లీన్ స్వీప్ చేసి భారత్ సమరోత్సాహంలో ఉండగా.. కనీసం టీ20 సిరీస్ అయినా గెలిచి పరువు దక్కించుకనేందుకు బంగ్లా పాకులాడుతోంది.

తాజాగా ముగిసిన రెండో టెస్టులో అసాధారణ ఆటతీరుతో విజయాన్ని కైవసం చేసుకున్న భారత్  మరోమారు అదే మార్కు చూపేందుకు సిద్ధం అయింది. సూర్యకుమార్ నేతృత్వంలో యువ భారత జట్టు బంగ్లాకు చెక్ చెప్పేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందరి కళ్లు మయాంక్ యాదవ్‌పై నెలకొనగా.. హర్షిత్ రానా, అర్షదీప్‌లతో కూడిన సీమ్ ఎటాక్ ముందు బంగ్లా బ్యాటర్స్ ఎంత వరకు తట్టుకుంటారనేది ప్రశ్నార్థకం.

ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చాలా రోజుల తర్వాత జాతీయ జట్టుకు ఆడనున్నాడు. బంగ్లాతో తొలి టీ20కి ఆల్‌రౌండర్ శివమ్ దూబే దూరమయ్యాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న దూబే బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీకి చేరుకున్నాడు. దూబే స్థానంలో హైదరాబాదీ తిలక్ వర్మను ఎంపిక చేశారు.

మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న గ్వాలియర్‌లోని స్టేడియంలో 14 సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. చివరగా 2010లో దక్షిణాఫ్రికాతో భారత్ వన్డే మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లోనే భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీతో మెరవడం విశేషం.