- జిల్లాల్లో పూర్తయిన ఏర్పాట్లు
- నిమజ్జన కేంద్రాల్లో భారీగా బందోబస్తు
ఆదిలాబాద్, సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి): గణేష్ నిమజ్జనోత్సాలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, జిల్లాలో వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మల్టీ జోన్ వన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. పోలీస్ అతిథి గృహంలో పోలీసు సాయుధ బలగాలతో గౌరవ వందనాన్ని సీకరించారు.
అనంతరం ఐజీ మాట్లాడుతూ.. పోలీసులు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆదిలాబాద్ పట్టణాన్ని 11 సెక్టార్లను విభజించి ఎస్సై స్థాయి అధికారులను కేటాయించామన్నారు. ఐజీ వెంట అదనపు ఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, ప్రసాద్, సీఐలు ఉన్నారు.
హనుమకొండలో..
హనుమకొండ, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8,066 వినాయక విగ్రహాలు మండపాల్లో కొలువుదీరగా.. ఒక్క గ్రేటర్ వరంగల్‌లోనే 5,044 విగ్రహాలు ఉన్నాయి. ట్రై సిటీ పరిధిలోని 66 డివిజన్ల పరిధిలో భారీగా విగ్రహాలు ఉన్నందును నిమజ్జనానికి పోలీసులు, అధికారులు భారీగా ఏర్పాటు చేశారు. వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో మరో రెండు భారీ క్రేన్లు అందుబాటులో ఉంచుతున్నారు. హనుమకొండలోని పద్మాక్షి టెంపుల్ సిద్ధేశ్వర గుండం, వరంగల్‌లోని చిన్న వడ్డెపల్లి చెరువు, వరంగల్ కోట చెరువు, గీసుగొండ కట్ట మల్లన్న చెరువు, కరీమాబాద్ ఉర్సు గుట్ట రంగం చెరువు, మామూనూర్ పెద్ద చెరువు, కాజీపేట బంధం చెరువు, చల్లా చెరువు, గోపాల్‌పూర్ చెరువు, బీమారం చెరువు, హసన్‌పర్తి చెరువులను ప్రధాన పాయింట్లుగా గుర్తించారు.
పెద్దపల్లి జిల్లాలో
పెద్దపల్లి,మంథని,సెప్టెంబర్15 (విజయక్రాంతి): రామగుండం, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో సోమవారం వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగనున్నది. రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో సింగరేణి, ఎన్టీపీసీ, ట్రాన్స్ కో, ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థల సహకారంతో గోదావరి వంతెన వద్ద అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లాలో దాదాపు 2 వేలకు పై చిలుకు వినాయకులను నిమజ్జనం చేయనున్నారు. మంచిర్యాల జిల్లా ఇందారం, జైపూర్, శ్రీరాంపూర్ ఏరియాల నుంచి కూడా గోదావరిఖని శివారు గోదావరి నదికి తీసుకవచ్చి వంతెనపై నుంచి నిమజ్జనం చేయనున్నారు.
గోదావరి నదిపై గల రెండు వంతెనలపై రామగుండం నగర పాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. రామగుండం సీపీ ఎం. శ్రీనివాసులు ఆదేశాలతో పోలీస్ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. డ్రోన్, సీసీ కెమెరాలతో నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మంథని సమీపంలోని గోదావరి, పెద్దపల్లిలోని మినీ ట్యాంక్ బండ్‌లో గణనాథులను పెద్దసంఖ్యలో నిమజ్జనం చేయనున్న దృష్ట్యా ఆదివారం రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, సుల్తానాబాద్‌లోని నిమజ్జన ప్రదేశాలను పెద్దపల్లి డీసీపీ చేతనతో కలిసి పరిశీలించారు. సీపీ వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, ట్రాఫిక్ సీఐ అనిల్‌కుమార్, మంథని సీఐ రాజు ఉన్నారు.
నిజామాబాద్‌లో..
నిజామాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): వినాయక నిమర్జనం సందర్భంగా ఎనిమిది అడుగుల కన్నా ఎత్తున విగ్రహాలను ఉమ్మెడ గోదావరి వంతెన వద్ద నిమజ్జనం చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులకు ఆదివారం నిజామాబాద్ కలెక్టర్, పోలీసు కమిషనర్ ఓ ప్రకటనలో సూచించారు. ఎత్తున వాహనాలు బాసర వెళ్లేందుకు వీలు లేకపోయిందని స్పష్టం చేశారు. జాన్కంపేట్, నవిపేట్ వద్ద ఉన్న రైల్వే క్రాసింగ్స్ వద్ద ఎలక్ట్రిక్ లైన్స్, రైల్వేశాఖ లెవెల్ బీమ్స్ ఏర్పాటు చేసిందన్నారు.
ఎత్తున విగ్రహాలు క్రాసింగ్ దాటడం సాధ్యంకాదన్నారు. కాబట్టి ఎత్తున వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని నందిపేట్ మండల్‌లోని ఉమ్మెడ గోదావరి వంతెన వద్ద చేయాలన్నారు. నిజామాబాద్ నగరం నుంచి కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తా, మానిక్ బండార్, మాక్లూర్, ఆంధ్రనగర్, నందిగుట్ట మీదుగా నందిపేట్ మండలం ఉమ్మెడకు చేరుకోవచ్చని కమిషనర్ తెలిపారు. నిమజ్జనం సందర్భంగా నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ డైవర్ట్ చేయనున్నట్లు సీపీ తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట, సెప్టెంబర్ 15: సర్కార్ నిర్దేశించిన ప్రదేశాల్లోనే ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఆదివారం ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు, రూరల్‌లో మూసీ, కోదాడలో పెద్దచెరువు, అనంతగిరిలో పాలేరు వాగు, మట్టపల్లిలో కృష్ణా, నేరేడుచర్లలో చిలేపల్లి వద్ద మూసీ, చింతలపాలెంలో బుగ్గమాధారం, పాలకవీడులో మహంకాళిగూడెం ఘాట్లతో పాటు స్థానికంగల చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేయవచ్చన్నారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 25 మంది ఇన్‌స్పెక్టర్లు బందోబస్తు నిర్వహిస్తారన్నారు.
ప్రశాంతంగా గణనాథుడి నిమజ్జనం
నిర్మల్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో భారీ బందోబస్తు మధ్య ఆదివారం గణేశ్ నిమజ్జన శోభయాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఉత్సవ కమిటీ సభ్యులు గడ్డెన్న వాగులో విగ్రహాలను నిమజ్జనం చేశారు. శోభయాత్రలో ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ అవినాశ్ కుమార్ పాల్గొన్నారు.